కాకినాడ రూరల్: మోదీ మెప్పు కోసం అక్కడ ఢిల్లీలో పొగడ్తల వర్షం కురిపించి, ఇక్కడ రాష్ట్రంలో లబ్ధి పొందేందుకు కేంద్రాన్ని తిడుతున్నట్టు కలరింగ్ ఇస్తూ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం చంద్రబాబు, ఆయన అనుకూల ఈనాడు, ఇతర పత్రికలకు పరిపాటిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపాలనే ఉద్దేశంతో రైతులు, మద్దతు ధరల గురించి ఈనాడు, మరికొన్ని పత్రికలు అబద్ధాలను వండి వారుస్తున్నాయన్నారు. రోజుకు నాలుగు అబద్ధాల ద్వారా చంద్రబాబును ప్రజల్లో నిలబెట్టాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే..
ఎవరేం మాట్లాడారో ప్రజలకు తెలుసు
► వ్యవసాయ బిల్లుపై ముగ్గురు టీడీపీ ఎంపీలు గట్టిగా వాదించినట్టు, వైఎస్సార్ ఎంపీలు గళం విప్పలేదన్నట్టు చంద్రబాబు మాట్లాడుతుండటం దారుణం. మొన్నటి పార్లమెంట్ సమావేశాల్లో ఎవరేం మాట్లాడారనేది ప్రజలందరికీ తెలుసు.
► మద్దతు ధర విషయంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్లమెంటులో ఆహా ఓహో అన్నారు. రైతులకు, వర్తకులకు మధ్య నేరుగా క్రయవిక్రయాలు జరిగితే రైతుల ఆదాయం పెరుగుతుందని, ఖర్చు తగ్గుతుందని చెప్పారు. తీరా ఇప్పుడు రైతు ఉద్యమం నేపథ్యంలో కమ్యూనిస్టులతో కలిసి యూటర్న్ తీసుకుని, ఆ బిల్లును వ్యతిరేకించినట్టు మాట్లాడుతున్నారు. ఇదెక్కడి న్యాయం?
► వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ.. ఎంఎస్‌పీలు కొనసాగుతాయని ప్రధాని మోదీ చెప్పినందునే బిల్లుపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు లేఖ రాయండి
► వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు చంద్రబాబు ఈ రోజు ఎందుకు ప్రకటించలేదు? కనీసం ఈరోజైనా మోదీకి లేఖ రాయాలి. అక్కడ ఒక మాట.. ఇక్కడ ఒక మాట మాట్లాడుతుండటం టీడీపీకి, చంద్రబాబుకే చెల్లింది.
► దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆర్బీకేలు, పంటల బీమా, పరిహారం, పంటల కొనుగోలు.. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలకు నాంది పలికారు.
► ఇవన్నీ మీకు తెలియవా చంద్రబాబూ? తెలిసే నటిస్తున్నారా? ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? 18 నెలల మా పాలన, మీ హయాంలో 18 నెలలు లేదా ఐదేళ్ల పాలనలో రైతులకు అమలు చేసిన పథకాలపై చర్చకు మీరు సిద్ధమా?
► మీ హయాంలో ఏనాడూ మీరు రైతుల గురించి ఆలోచించలేదు. పాడి రైతులకు అన్యాయం చేశారు. మీ హెరిటేజ్ కోసం సహకార డెయిరీలను నిర్వీర్యం చేశారు. ఇప్పుడా విషయం చర్చకు వస్తుండటంతో ప్రజల దృష్టి మళ్లించడానికి మీ అనుకూల మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తున్నారు.
► మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పవన్ కల్యాణ్ అధికార టీడీపీని కాకుండా మమ్నల్ని ప్రశ్నించేవారు. ఇప్పుడు ప్రశ్నించడంలో ఆశ్చర్యమేముంది? చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్కటే. ఆయన దీక్షలు చేయాల్సిన అవసరం లేదు. మేము ఎప్పటికప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment