పేదవాడికి సాయం చేసేలా విజన్ ఉండాలి
చంద్రబాబు ఒక్క రూపాయైనా సాయం చేశారా?
సంపద సృష్టి కొద్దిమందికే..
అల్లు అర్జున్ అరెస్టు కక్షసాధింపులా ఉంది
మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన విజన్–2047 జనాలను మభ్యపెట్టేందుకేనని, ఆ విషయంలో ఆయన ఘనుడని మాజీమంత్రి వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన విజన్–2047 పేదల అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గతంలో విజన్–2020 ప్రవేశపెట్టినప్పుడే కమ్యూనిస్టులు ‘విజన్–2020.. చంద్రబాబు 420’గా.. వరల్డ్ బ్యాంకు జీతగాడుగా పిలిచేవారు. ఇప్పటికీ ఆయన విజన్‌లో ఎలాంటి మార్పూలేదు. విజన్–2047 గురించి మాట్లాడే ముందు 2024 పరిపాలన విధానంపై ఆయన ఆలోచించాలి. విజన్ అనేది పేదవాడికి సహాయం చేయడానికి ఉండాలి.
కానీ.. చంద్రబాబు ఒక్క రూపాయి అయినా సహాయం చేశారా? రైతులకు రూ.20 వేలు పెట్టుబడి రాయితీ, ఉచిత పంటల బీమా ఊసేలేదు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఆయన 2014లో రుణమాపీ చేయకుండా రైతులను మోసం చేశారు. చంద్రబాబు 1998లో రూ.2 కోట్ల 50 లక్షలతో మెకాన్సీ సంస్థ ద్వారా విజన్ డాక్యుమెంట్ తయారుచేయించారు. అందులో.. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేసి యూజర్ ఛార్జీలు వసూలుచేయమని ఉంది.
మెడికల్ సీట్లు వద్దనడమే బాబు విజన్..
జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలకు అనుమతిచ్చి ఐదింటిని పూర్తిచేస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం చంద్రబాబు విజన్. అలాగే, వలంటీర్లు, బేవరేజ్ కార్పొరేషన్ సిబ్బందినీ తొలగించి వారిని రోడ్డున పడేశారు. సంపద సృష్టి అంటూ ప్రచారం చేస్తున్నా కొంతమందికే సంపద కలుగుతోంది. అమరావతికి రూ.15వేల కోట్ల అప్పు దొరకిందన్న అనందం తప్ప పేదవాడికి పది రూపాయలు సహాయం చేశామన్న సంతోషంలేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి కిందస్థాయి అధికారుల వరకు అందరినీ వేధిస్తున్నారు.
ఈ ఏడు నెలల కాలంలో రూ.70 వేల కోట్ల అప్పుచేయగా.. ప్రజలకు ఏంచేశామో చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులతో రిమాండ్‌కు తరలిస్తున్నారు. కానీ, జగన్‌మోహాన్‌రెడ్డి మీద మీరు ఎన్ని పోస్టులైన పెట్టొచ్చా? మీ మాటలకు, చేతలకు పొంతనలేదు. ఉచిత ఇసుక ఎక్కడా అమలుకావడంలేదు. ఇలా ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు?
ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ అరెస్టు..
అల్లు అర్జున్ అరెస్టు నూటికి నూరుశాతం ఉద్దేశపూర్వకంగా జరిగిన కక్ష సా«ధింపులా ఉంది. నాలుగు రోజులు జైలులో ఉంచాలని చూసినట్లుగా ఉంది. తొక్కిసలాట సంఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదా? ఈ విషయంలో ఏపీలో ఒక చట్టం, తెలంగాణాలో ఒక చట్టం అమలవుతోంది. గత గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే ఆనాడు చంద్రబాబులో కనీసం పశ్చాత్తాపం కనబడలేదు. అప్పుడాయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇక రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment