గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీజేపీ 6 శాతం ఓట్లతో కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే తిరిగి ఆరునెలల్లోపే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటుబ్యాంకు తెలంగాణలో 19శాతానికి ఎగబాకింది. నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన కమలనాధులు తెలంగాణాలో వెనక్కి తిరిగిచూడలేదు. దుబ్బాక ఉపఎన్నికల్లో రఘనందన్ ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించడంతో ఆ పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ నాలుగు పదుల స్థానాలు గెలవడంతో బీజేపీలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది. ఊహించని రీతిలో ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ నుంచి బయటకు రావడం... బీజేపీలో చేరడం చకచకా జరిగిపోయాయి. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుస్తుందా లేక ఈటల గెలుస్తారా అనే చర్చ తెలంగాణా రాజకీయాలను కుదిపేసింది. హుజురాబాద్‌లో ఈటల గెలిస్తే అది ఆయన వ్యక్తి గెలుపనే చర్చా జరిగింది. అయితే టీఆర్అస్ చివరి వరకు గట్టిపోటీ ఇస్తున్నట్లు కనిపించినా... హుజురాబాద్ గడ్డపై భారీ మెజార్టీతో కమలం జెండా రెపరెపలాడింది.
హుజురాబాద్ గెలుపుతో బీజేపీలో కదనోత్సాహం ఉరకలెత్తింది. ఇక తెలంగాణాలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే చర్చ కూడా మొదలైంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కొండా కమలం జెండా చేతపట్టారు. 2018 ఎన్నికల తరువాత వరుసగా చేరికలపై దృష్టిసారించిన బీజేపీ ముందుగా గద్వాల జేజెమ్మ డీకే అరుణను పార్టీలో చేర్చుకుంది. తర్వాత వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన గట్టు శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి నేతలు ఇటీవల బీజేపీలో చేరారు. ఓవైపు చేరికలపై సీరియస్‌గా ప్రయత్నిస్తున్నా... తెలంగాణాలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కావాలనుకున్న బీజేపీ అనుకున్నంత వేగంగా విస్తరించలేకపోతోంది.
ఉత్తర తెలంగాణాలో బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్ధులు లేరు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా కరీంనగర్‌లోనూ.. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి గట్టి నాయకత్వం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నా...స్థానికంగా బలమైన నేతలు లేకపోవడం బీజేపీకి ప్రతికూలాంశం. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లాంటి నేతలను పార్టీలో చేర్చుకోవడం ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక ఊపు తీసుకువచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక నల్లగొండ, ఖమ్మం లాంటి జిల్లాల్లో పట్టుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కమలనాథులు. నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరతామని చెప్పినా ఇంకా అధికారికంగా చేరలేదు. రాజకీయంగా ఎదిగే అవకాశం ఉన్నా పార్టీలో కొంతమంది నాయకుల తీరువల్లే ఇతర పార్టీల నేతలు రావడంలేదనే విమర్శలు వస్తున్నాయి. జాతీయ కార్యవర్గ సమావేశం తరువాత కమిటీ వేయడం ద్వారా రాబోయే రోజుల్లో చేరికలపై బీజేపీ సీరియస్‌గా ఉందనే సిగ్నల్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి: అయోమయంలో కాంగ్రెస్.. రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందా?
Comments
Please login to add a commentAdd a comment