సాక్షి, హైదరాబాద్: ‘వామపక్ష పార్టీలైన సీపీఎం, సీపీఐలు విడివిడిగా పోటీ చేసి ఎంతో నష్టపోయాయి. ఇకపై వేరువేరుగా పోరాటం చేయకుండా ఐక్యంగా ముందుకు పోవాలని నిర్ణయించాం. అంతేకాకుండా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న బీఆర్‌ఎస్ పార్టీకికి మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నాం. దేశంలో బీజేపీ వ్యతిరేక లౌకిక శక్తులను ఏకం చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే మా లక్ష్యం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి మద్దతు కొనసాగిస్తూ మాకు బలం ఉన్న చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.
అతి త్వరలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చిస్తాం..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం ఎంబీ భవన్‌లో సీపీఎం, సీపీఐల ఉమ్మడి సమావేశం జరిగింది. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. అనంతరం తమ్మినేని, కూనంనేని మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్‌తో జట్టు కట్టం: తమ్మినేని
బీఆర్‌ఎస్‌తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్ పారీ్టతో జత కడతారనే తప్పుడు వార్తలను తమ్మినేని ఖండించారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సత్తా బీఆర్‌ఎస్‌కు ఉందని, అందుకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్ తనకు తానుగా చొరవ చేసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరిందని, రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని చెప్పారు. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. సీట్ల కేటాయింపులపై సీఎం కేసీఆర్‌తో ఇప్పటివరకు తాము చర్చించలేదన్నారు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని కొందరు అనుకుంటున్నారని, కానీ తమకు బలం ఉన్న చోట సన్నాహాలు చేసుకుంటున్నామని తెలిపారు.
ఓట్లు, సీట్ల కోసం దిగజారం: కూనంనేని
మునుగోడులో ఏర్పడిన విపత్తును వామపక్షాలు అడ్డుకున్నాయని కూనంనేని అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంటులను ప్రజలు ఊహించుకోవడం లేదన్నారు. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవని, వ్యక్తిగత దూషణలకే పరిమితమవుతుందని విమర్శించారు. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు వివరించారు. గిరిజనేతరులకూ పోడు భూములు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ అంశం త్వరలో సీఎంకు వివరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment