మళ్లీ కారు..కొడవలి!  | Left parties to work with BRS | Sakshi
Sakshi News home page

మళ్లీ కారు..కొడవలి! 

Published Sun, Mar 10 2024 1:50 AM | Last Updated on Sun, Mar 10 2024 1:50 AM

Left parties to work with BRS - Sakshi

బీఆర్‌ఎస్‌ వైపు వామపక్షాల చూపు

లోక్‌సభ ఎన్నికల్లో కలిసివెళ్లే దిశగా అడుగులు 

బీఆర్‌ఎస్, బీఎస్పీ పొత్తు నేపథ్యంలో కొత్త పరిణామం 

కమ్యూనిస్టులకూ గులాబీ నేతల ఆహ్వానం  

ఇండియా కూటమిలో ఉన్నా కాంగ్రెస్‌ పట్టించుకోక పోవడంపై లెఫ్ట్‌ గుర్రు 

చెరో సీటు ఇస్తే చాలన్నా ఖాతరు చేయకపోవడంపై అసహనం 

కేరళ సీఎం విజయన్‌ను సీఎం రేవంత్‌ విమర్శించడం, ప్రధాని మోదీని ప్రశంసించడంపై ఆగ్రహం 

ఇప్పటికే బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐల మధ్య అనధికారిక మంతనాలు 

మునుగోడు ఉప ఎన్నికలో కలిసి ముందుకెళ్లిన పార్టీలు 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భారత్‌ రాష్ట్ర సమితితో కలిసి పనిచేసే దిశగా వామ పక్షాలు అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమ్యూని స్టు పార్టీలు.. అందుకు కలిసి వచ్చే అవకాశం ఉన్న, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ భే టీ అయిన సంగతి తెలిసిందే.

కాగా వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని ఈ రెండు పార్టీలూ నిర్ణయించాయి. త్వరలోనే పొత్తుకు సంబంధించిన విధివిధానాలు, సీట్ల పంపకాలపై చర్చలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో ఓటమి పాలైన బీఆర్‌ఎస్, సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా రాష్ట్రంలో తమ పట్టును నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికార పార్టీకి సవాల్‌ విసరాలనే ఆలోచనతో ఉంది.

ఈ నేపథ్యంలో కొందరు బీఆర్‌ఎస్‌ నేతల నుంచి కమ్యూనిస్టు పార్టీలకు కూడా పిలుపు వచ్ఛి నట్లు తెలిసింది. తాము వచ్చి చర్చలు జరుపుతామని, అందుకు సుముఖమేనా అని బీఆర్‌ఎస్‌ వర్గాలు అడిగినట్లు కామ్రేడ్లు చెబుతున్నారు. ఇప్పటికే అనధికారికంగా లెఫ్ట్, బీఆర్‌ఎస్‌ మధ్య మంతనాలు జరుగుతున్నట్లు కమ్యూనిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి.  

కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలనుకున్నా.. 
వాస్తవానికి బీజేపీని ఓడించేందుకు ‘ఇండియా’కూటమిలో భాగమైన కాంగ్రెస్‌తో, రాష్ట్రంలోనూ కలిసి వెళ్లాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. చెరో సీటు ఇస్తే చాలన్నట్టుగా సంకేతాలు పంపాయి. కానీ దేశవ్యాప్తంగా పొత్తులు కుదుర్చుకుంటూ, రాష్ట్రంలో సైతం ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించిన హస్తం పార్టీ నుంచి ఇప్పటివరకు ఈ దిశగా ఎలాంటి చొరవా, కదలిక లేకపోవడం వామపక్షాలను ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌తో పొత్తు ఆలోచనలో లెఫ్ట్‌ పార్టీలు ఉన్నట్టు తెలుస్తోంది.  

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తు 
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లాలని సీపీఐ, సీపీఎం భావించాయి. అయితే ‘ఇండియా’కూటమికి కాంగ్రెస్‌ నేతృత్వం వహిస్తున్నందున వామపక్షాలతో జట్టు కట్టకూడదని బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని లెఫ్ట్‌ పార్టీలు నిర్ణయించాయి. అయితే సీట్ల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సీపీఎం ఒంటరిగానే 19 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జతకట్టింది.

ఒకే ఒక్క స్థానం కొత్తగూడెంలో పోటీ చేసి గెలిచింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని సీపీఐ నిర్ణయించుకోగా, ఇండియా కూటమి దృష్ట్యా సీపీఎం కూడా సుముఖంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని, చెరో స్థానం ఇస్తే చాలని కూడా రెండు పార్టీలు ఎప్పుడో ప్రకటించాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ ఇప్పటివరకు ఈ విషయం పట్టించుకోలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చివరివరకు పొత్తుపై తేల్చకుండా నాన్చారని, దానివల్ల తాము నష్టపోయామని సీపీఎం వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రావడంతో సీపీఎంతో పాటు సీపీఐ కూడా గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అధికారంలోకి వచ్చాక తమ అవసరం లేదన్నట్లుగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని కమ్యూనిస్టు వర్గాలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. 

విజయన్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కేరళ వెళ్లారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయన్‌ హైదరాబాద్‌ వచ్ఛి న సందర్భంగా ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడాన్ని, కేంద్రంలోని బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన సభలో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు పాల్గొనడాన్ని రేవంత్‌ తప్పుపట్టారు. ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతిపరుడని, ఆయనను కలిసిన విజయన్‌ కూడా అవినీతిపరుడని, అందుకే కేసీఆర్‌ను కలిశారంటూ నోరు పారేసుకున్నారు.

ఈ వ్యాఖ్యలపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్‌ వ్యాఖ్యలు బాధ్యతారహితమని పేర్కొంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఏకంగా ఒక ప్రకటనే విడుదల చేశారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడం సంప్రదాయమన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలియదా? కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడే క్రమంలో కేసీఆర్‌ ఆహ్వానం మేరకు సభలో పాల్గొని విజయన్‌ ఏమి మాట్లాడారో సీఎం మరచిపోవడం ఆశ్చర్యకరం.

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం సీపీఎం పాత్ర ఏమిటో కూడా మరచిపోయి, బాధ్యత మరచి, తప్పుడు ఆరోపణలు చేశారు..’అంటూ ఘాటుగా ధ్వజమెత్తారు. కాగా అప్పట్నుంచే వామపక్షాలు కాంగ్రెస్‌పై వామపక్షాలు ఒకింత అసహనంతో ఉన్నాయి. 

ప్రధాని మోదీని ప్రశంసించిన సీఎం 
ఇది చాలదన్నట్టు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రానికి వచ్ఛినప్పుడు సీఎం రేవంత్‌ ఆయనతో కలిసి సభలో పాల్గొనడం, అంతేకాకుండా ప్రధానిని ప్రశంసిస్తూ మాట్లాడటం, పెద్దన్న మోదీ అంటూ సంబోధించడాన్ని కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు కానీ రాజకీయ విభేదాలు మరిచి పొగడడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు.

తమతో పాటు బీజేపీతో ప్రధానంగా పోరాడేది కాంగ్రెస్‌ పార్టీయేనన్న విషయాన్ని మరిచి రేవంత్‌రెడ్డి వ్యవహరించారని కమ్యూనిస్టులు అంటున్నారు. రేవంత్‌రెడ్డి సైతం బీజేపీపై గట్టిగా పోరాడాల్సింది పోయి మెతక వైఖరితో ఉన్నారని భావిస్తున్నారు.

ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని బీఆర్‌ఎస్‌తో కలిసి వెళ్లే ఆలోచనలో లెఫ్ట్‌ పార్టీలు ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉప ఎన్నికలో కూడా ఈ మూడు పార్టీల శ్రేణులు కలిసి పనిచేసిన విషయాన్ని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement