పెద్దల సభకూ గౌరవమివ్వరా!! | Legislative Council Chairman angry over TDP MLCs | Sakshi
Sakshi News home page

పెద్దల సభకూ గౌరవమివ్వరా!!

Published Fri, Mar 18 2022 3:32 AM | Last Updated on Fri, Mar 18 2022 8:40 AM

Legislative Council Chairman angry over TDP MLCs - Sakshi

సాక్షి, అమరావతి : పెద్దల సభగా పిలిచే శాసన మండలి గౌరవాన్ని తగ్గిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలపై చైర్మన్‌ మోషేన్‌రాజు మండిపడ్డారు. గురువారం ఉదయం సభ ప్రారంభం నుంచి సభ ముగిసే వరకు టీడీపీ ఎమ్మెల్సీలందరూ పోడియం వద్ద నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కల్తీ సారా పేరిట అబద్ధాన్ని నిజం చేయడానికి విఫలయత్నం చేశారు. ఎన్నిసార్లు వారి సీట్లలోకి వెళ్లాలని విజ్ఞప్తి చేసిన వారు వినకపోవడంతో చైర్మన్‌ ఒకింత ఆగ్రహంతో.. ‘మీ చేతుల్లో ప్లకార్డులను టీవీ కెమోరాల్లో కనిపించాలని పదే పదే తిప్పుతున్నారు.

మీరు చేస్తుంది ప్రజల కోసమా.. ప్రచారం కోసమా అని తెలిసిపోతోంది’ అని అన్నారు. అంతకు ముందు సభలో మాట్లాడే సభ్యులకు, చైర్మన్‌ సీటుకు మధ్య ప్లకార్డులతో అడ్డంగా వచ్చారు. ఇది సరైన పద్ధతి కాదని, చెప్పదల్చుకున్నది సీట్ల వద్దకు వెళ్లి మాట్లాడాలని చైర్మన్‌ సూచించారు. నాలుగు నిమిషాల్లో పరిష్కారమయ్యే అంశంపై నాలుగు రోజులుగా రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. మీరు సింగిల్‌ అజెండాతో వచ్చినట్టు ఉందని, మీ బాధ్యత విస్మరిస్తున్నారని, గౌరవాన్ని కాపాడుకోవాలని హితవు పలికారు. అయినా టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దే నిలబడ్డారు.

చంద్రబాబు ఇగో సంతోష పెట్టడం కోసమే
సభలో టీడీపీ సభ్యుల తీరును మంత్రులు ఎండగట్టారు. చంద్రబాబు ఇగోను సంతోషం పెట్టడం కోసమే సభను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దల సభ అన్న గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్‌ పెట్టిన మద్య నిషేధాన్ని ఆ తర్వాత చంద్రబాబే ఎత్తేశారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆ మహానుభావుడి చావుకు కారణమై, ఆయన ఆశయాలకు తూట్లు పొడిచి, ఇప్పుడు అదే మద్య నిషేధం గురించి మాట్లాడే అర్హత వారికి ఎక్కడిదని ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై అధికారులకు టార్గెట్లు పెట్టి, పూర్తి చేయని వారిపై  చర్యలు తీసుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు గుర్తు చేశారు.

టీడీపీ ఎమ్మెల్సీలందరి చేతులు నొప్పి పుట్టేలా ప్లకార్డులు పట్టిస్తున్నారని, కానీ, లోకేష్‌ మాత్రం పట్టుకోలేదని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఎన్ని గంటలైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అబద్ధాలపై సమయం వృథా చేయొద్దని అన్నారు. చర్చకు తామెప్పుడూ భయపడలేదన్నారు. పారిపోవడం, శోకాలు పెట్టడం, దాక్కోవడం చంద్రబాబుకే చెల్లిందని ఎద్దేవా చేశారు. దావూద్‌ ఇబ్రహీంలా చంద్రబాబు ఎక్కడో ఉండి డైరెక్షన్‌ ఇచ్చి సభలో రచ్చ చేయిస్తున్నారని చెప్పారు.

మొదట 18 మరణాలన్నారు.. ఇప్పుడు 42కు పెంచారు
కల్తీ సారాపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, మూడు రోజుల్లో రకరకాల సంఖ్యలు చెప్పారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తప్పుపట్టారు. ‘మూడు రోజుల క్రితం 18 మంది కల్తీ సారాతో మరణించారని అసెంబ్లీలో చెప్పారు. మండలికి వచ్చే సరికి 26 అన్నారు. మళ్లీ అసెంబ్లీలో 28 అన్నారు, ఇçప్పుడు 42 అంటున్నారు. మూడు రోజుల్లో మరణాల సంఖ్య ఇంతగా ఎలా మారుతుంది’ అని ప్రశ్నించారు. దీంతోనే వారు చెప్పేది అబద్ధమని తేలిపోతోందని తెలిపారు. అల్లరి చేయడమే టీడీపీ ఎమ్మెల్సీల ఉద్దేశమని, వారిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య చైర్మన్‌ను కోరారు. దళిత సమస్యలపై చర్చ జరగకుండా టీడీపీ సభ్యులు అడ్డుపడుతున్నారని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు.

మద్యనిషేధానికి తూట్లు పొడిచింది బాబే: మంత్రి కొడాలి నాని
మద్య నిషేధంపై టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంపై మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తీవ్రంగా స్పందించారు. ఎన్టీ రామారావు తెచ్చిన మద్య నిషేధానికి తూట్లు పొడిచింది చంద్రబాబు అని,  సిగ్గూ శరం లేకుండా ఇప్పుడు మద్య నిషేధంపై చర్చ పేరుతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నిన్నటి వరకు పసుపు ప్లకార్డులతో వచ్చిన వీళ్లు ఈరోజు జనసేన రంగుల ప్లకార్డులతో వచ్చారని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు, బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం లేకుండా వారి హక్కులను కూడా హరిస్తున్నారని, వారిపై చైర్మన్‌ చర్య తీసుకోవాలని నాని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement