టి.నరసాపురం:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను రక్తి కట్టించేందుకు పార్టీ అధిష్టానం ఎంతగా ఆర్భాటం చేస్తున్నా.. స్పందన లేక వెలవెలబోతోంది. కిరాయి ఇచ్చి ముందుగా ఏర్పాటు చేసుకున్న జనం తప్ప ప్రజలెవరూ పాదయాత్ర వైపు కన్నెత్తి చూడటం లేదు. మంగళవారం చింతలపూడి మండలం తీగలవంచ నుంచి లోకేశ్ పాదయాత్ర మొదలైంది.
పోలవరం నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించే సమయంలో స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు రెండు కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రమైన టి.నరసాపురం వరకు పాల్గొన్నారు. పాదయాత్రకు ఎక్కడా ప్రజాస్పందన కనిపించలేదు. పాదయాత్ర బొర్రంపాలెం వరకు సాగింది. శ్రీరామవరంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించారు. పాదయాత్రలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం భోజనం కోసం ఏర్పాట్లు చేశారు. జనం ఎవరూ రాకపోవడంతో వంటకాలన్నీ మిగిలిపోయాయి.
కాగా.. టి.నరసాపురం మండలంలో మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీ వర్గీయులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. శ్రీరామవరంలో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ చిత్రపటం ఉన్న ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆ గ్రామంలోని పార్టీ నాయకులు అభ్యంతరం తెలపడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment