
అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా వేదికగా కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తుంటే.. అదే స్థాయిలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను తప్పికొడుతున్నారు. తాజాగా రాహుల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మండిపడ్డారు.
దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలబడటం రాహుల్‌కు, కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని అమిత్ షా విమర్శించారు. ‘దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్న శక్తులకు అండగా నిలవడం, దేశవ్యతిరేక ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది.
అది జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన దేశ వ్యతిరేక, రిజర్వేషన్ వ్యతిరేక ఎజెండాకు మద్దతివ్వడమైనా సరే లేదా విదేశీ గడ్డపై భారత వ్యతిరేక ప్రకటనలు చేయడమైనా సరే.. రాహుల్ గాంధీ ఎప్పుడూ దేశ భద్రతను ముప్పులో పడేస్తున్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.
ప్రాంతీయవాదం, మతం, భాషా భేదాల తరహాలో చీలికలు తెచ్చే కాంగ్రెస్ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రకటన బయటపెట్టింది. దేశంలో రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడటం ద్వారా.. కాంగ్రెస్‌కు, ఆయనకు రిజర్వేషన్‌పై ఉన్న వ్యతిరేకతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.
ఆయన మనసులో మెదిలే ఆలోచనలే చివరికి మాటల రూపంలో బయటపడ్డాయి. ఇక్కడ నేను రాహుల్‌కు ఒక విషయం స్పష్టంచేయాలని అనుకుంటున్నాను. బీజేపీ ఉన్నంతకాలం రిజర్వేషన్లను ఎవరూ రద్దు చేయలేరు. అలాగే దేశభద్రతతో ఎరూ ఆటలాడలేరు’ అంటూ మండిపడ్డారు.