హైదరాబాద్: ఇటీవల వరంగల్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభను చూసి అధికార టీఆర్‌ఎస్ వణుకు మొదలైతే, బీజేపీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టిలేపిందన్న మధుయాష్కీ గౌడ్.. రైతు డిక్లరేషన్‌పై రాష్టంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు.
మంగళవారం గాంధీ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించిన మధుయాష్కీ గౌడ్..‘రైతు డిక్లరేషన్ లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల అధ్యక్షులు ప్రెస్ మీట్ లు పెట్టి రైతు డిక్లరేషన్ ప్రచారం చేయాలి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతు డిక్లరేషన్ ను నెల రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్తాము.
రాహుల్ గాంధీ సభ తరువాత బీజేపి.కి భయంపట్టుకుంది. రాహుల్ గాంధీ సభ చూసి టీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతోంది. రాహుల్ గాంధీ సభ ప్రతీ రైతు కుటుంబాన్ని తట్టి లేపింది. విగ్గుగాళ్ళకు, పెగ్గుగాళ్ళకు రాహుల్ గాంధీ గూర్చి మాట్లాడే స్థాయి లేదు. రాష్ట్రంలోని అన్ని రంగాల ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంటేనే మోసం దగా. కల్వకుంట్ల కుటుంబం అంటే ఊసరవెల్లిలా రంగులు మార్చే కుటుంబం. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అని అసెంబ్లీ సాక్షిగా చంద్రశేఖర్ రావు చెప్పాడు. కాంగ్రెస్ రైతాంగాన్ని కాపాడటానికి రైతు డిక్లరేషన్‌ను తీసుకుంది.
నిరుద్యోగులు, ఆదివాసులు , మైనారిటీలని ఏకం చేస్తూ మరో బహిరంగ సభ ఉంటుంది. సోనియాగాందీ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే ఎమ్మెల్యేకి బంగ్లాలు, వజ్ర వైడూర్యాలు ఎట్లా వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీకి 884 కోట్ల రూపాయల ఫండ్ ఎలా వచ్చింది?, రాహుల్ గాంధీ వచ్చిన తరువాత తెలంగాణ మేలుకుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆర్ఎస్ నేతలు మొహంజ మార్కెట్ లో గులాబీ పూలు అమ్ముకుంటు బతికేవారు. టీఆర్ఎస్ పతనం మొదలైంది’ అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment