సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు మహబూబ్‌నగర్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు పార్టీని వీడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. దీంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే తదుపరి నిర్ణయమని చెబుతున్నా.. కాంగ్రెస్‌లోనే చేరేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో కొత్తకోట దంపతులు కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో వీరే కీలకంగా ఉన్నారు. అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు దయాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నియోజకవర్గాల పునర్వివిభజనతో 2009లో మక్తల్ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దయాకర్‌రెడ్డి సతీమణి సీతమ్మ 2002లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పాటైనా దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ దంపతులు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిణామాల క్రమంలో స్తబ్దుగా ఉన్నారు. కొత్తకోట దంపతుల నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత పాలమూరులో టీడీపీ పరిస్థితి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయినట్లేనని తెలుస్తోంది. బక్కని నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి ఇద్దరు ముగ్గురు నాయకులే మిగలగా.. వారు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు.
కన్నీటి పర్యంతమైన దయాకర్‌రెడ్డి..
గురువారం దయాకర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవరకద్రలోని ఓ గార్డెన్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన ఆయన అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. 30ఏళ్లుగా టీడీపీతో పాటు ఎన్టీఆర్‌ఆర్, చంద్రబాబుతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని.. పార్టీలో కొనసాగినా ఇటు కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment