ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దాలను గుప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి తిరిగి అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఎ) మహాయతిని ఢీకొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది. అటు ఎంవీఏ కూటమి ఇటు మహాయతి (బీజేపీ, షిండే సేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) రెండూ మహిళలు, రైతులు, వృద్దులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతూ పలు పథకాలను ప్రకటించాయి.
కొత్తగా ఉచిత బస్సు ప్రయాణం
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం), కాంగ్రెస్‌ల కూటమి ఎంవిఎ ‘లోక్సేవేచి పంచసూత్రి’ కింద పలు వాగ్దానాలను ప్రకటించింది. ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైనవి ఉన్నాయి. అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని, రుణాలు చెల్లించే రైతులకు అదనంగా రూ.50 వేలు మాఫీ చేస్తామని ఎంవీఏ కూటమి హామీ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకూ ప్రయోజనం చేకూరుస్తామని, పేదలకు రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని అందిస్తామని హామీనిచ్చారు.
పథకాల మొత్తాల పెంపు
ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది. ఒకప్పుడు ఉచిత పథకాలను విమర్శిస్తూ, దేశ అభివృద్ధికి ఇది ప్రమాదకరమని పేర్కొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు బీజేపీ తరపున పలు సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహాయుతి తన లడ్కీ బహిన్ పథకపు మొత్తాన్ని 1,500 నుండి రూ.2,100కి పెంచింది. ఈ పథకం కింద మహిళలు, వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే విద్యార్థులకు నెలకు రూ. 10,000 సహాయం, రైతులకు రూ.15,000 ఆర్థిక సహాన్ని ప్రకటించింది. గతంలో ఇది రూ.12,000గా ఉంది.
మహిళలు.. లఖ్‌పతి దీదీలు
మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని అధికార మహాయతి కూటమి హామీ ఇచ్చింది. 2027 నాటికి 50 లక్షల మంది మహిళలను 'లఖ్‌పతి దీదీ'గా తీర్చిదిద్దుతామని పేర్కొంది. దీంతో పాటు రివాల్వింగ్ ఫండ్ రూపంలో రూ.1000 కోట్లు అందజేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇక మహావికాస్ అఘాడి (ఎంవీఏ) విషయానికొస్తే మహిళల కోసం మహాలక్ష్మి యోజనను ప్రారంభిస్తామని, దీని కింద మహిళలకు నెలకు రూ. 3000 ఆర్థిక సహాయం అందజేస్తామని హామీనిచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ సదుపాయాన్ని కల్పిస్తామని హామీనిచ్చింది.
రైతులకు రుణాలు.. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
మహారాష్ట్రలోని రైతులకు రూ.15 వేల వరకు రుణమాఫీ చేస్తామని మహాయుతి హామీ ఇచ్చింది. అలాగే వ్యవసాయోత్పత్తులపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై 20 శాతం రాయితీ కల్పిస్తామని అధికార కూటమి హామీ ఇచ్చింది. కరెంటు బిల్లులు కూడా తగ్గిస్తామని పేర్కొంది. ఇదే విషయంలో సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు రూ.50వేలు ఇస్తామని ప్రతిపక్ష కూటమి హామీ ఇచ్చింది. 10 లక్షల మంది విద్యార్థులకు రూ.10,000 స్కాలర్‌షిప్ ఇస్తామని మహాయుతి హామీనిచ్చింది. అలాగే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆకాంక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక ఎంవీఏ విషయానికొస్తే రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ.4000 స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
రాష్ట్రంలోని ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అధికార కూటమి వివేకానంద యూత్ హెల్త్ కార్డ్‌ను అందజేస్తామని, యువతకు వార్షిక ఆరోగ్య పరీక్షలను సులభతరం చేస్తామని పేర్కొంది. సీనియర్ సిటిజన్ల కోసం ఆధార్ ఎనేబుల్డ్ సర్వీస్ పాలసీని ప్రారంభించనున్నట్లు మహాయుతి తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభిస్తామని ఎంవీఏ హామీ ఇచ్చింది. ఉచితంగా మందులు అందజేస్తామని కూడా కూటమి హామీ ఇచ్చింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.21,500 నుంచి రూ.82,100కు పెంచుతామని మహాయుతి చెప్పగా, వృద్ధులకు ఇచ్చే పెన్షన్ అంశాన్ని ఎంవీఏ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారికి రూ.15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామని మహాయుతి తెలిపింది. ఎంవిఎ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో కుల గణనను నిర్వహిస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని కూడా తొలగిస్తామని ప్రకటించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 23న వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment