ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఉద్ధవ్ థాక్రే వర్గంపై నిప్పులు చెరిగారు. హిందుత్వ భావాజాలాన్ని, బాల్ థాక్రే ఐడియాలజీని వదిలేసినందుకు విరుచుకుపడ్డారు. ఇండియా కూటమితో కలిసి కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తున్న ఉద్ధవ్ థాక్రే వర్గంపై మండిపడ్డారు. అంతేకాకుండా లోక్‌సభలోనే హనుమాన్ చాలీసాను పఠించారు.
కల్యాన్ నుంచి ఎంపీగా గెలుపొందిన శ్రీకాంత్ షిండే నేడు లోక్ సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. వచ్చే రోజుల్లో యుద్ధం ఎన్డీయే వర్సెస్ ఇండియా కాదు.. స్కీం వర్సెస్ స్కాం అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి అంటేనే అవినీతికి మరోపేరు అని విమర్శించారు.
లోక్‌సభలో నేడు అవిశ్వాస తీర్మాణంపై చర్చలో భాగంగా షిండే మాట్లాడారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఉద్ధవ్ వర్గం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత విడిపోయి ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. శివసేన కాంగ్రెస్‌తో కలిసి పోటీచేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించరని అన్నారు. చివరికి కరసేవకులపై దాడి చేసిన సమాజ్ వాదీ పార్టీతో కూడా కలిసిపోతారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కనీసం హనుమాన్ చాలీషా కూడా చదవనీయలేదని ఉద్ధవ్ వర్గంపై మండిపడ్డారు. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు ఆయన నివాసం వద్ద హనుమాన్ చాలీసా పాఠనం చేస్తామని ప్రకటించిన ఎంపీ నవ్‌నీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాలను అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసి షిండే.. లోక్ సభలోనే హనుమాన్ చాలీసా పఠించారు. తొందరగా ముగించాలని స్పీకర్ చెప్పడంతో ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఇదీ చదవండి: వీల్ ఛైర్‌లో మన్మోహన్‌సింగ్.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment