టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
తెలంగాణ కోసం కేటీఆర్, ఆయన కుటుంబం ఏం త్యాగం చేసింది
ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ఆయన పగటి కలలు కంటున్నారు
సాక్షి, హైదరాబాద్: తండ్రీకొడుకులు తప్ప బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు. సోని యా గాంధీ లేనిదే తెలంగాణ లేదని, అధికారం పో యినా కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదని అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, ఎమ్మెల్సీలు ఆమేర్‌అలీ ఖాన్, బల్మూరి వెంకట్, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి బైకాని లింగం యాదవ్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఈనెల 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని, ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో పయనిస్తోందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో పదేళ్ల కాలంలో 50 వేల ఉద్యోగాలిస్తే, తాము ఏడాదిలోనే ఇచ్చామని చెప్పారు.
రాజీవ్ గాంధీ గురించి విమర్శించే అర్హత కేటీఆర్‌కు లేదని అన్నారు. రాజీవ్ కుటుంబం దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని, తెలంగాణ కోసం కేటీఆర్, ఆయన కుటుంబం ఏం త్యాగాలు చేసిందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తామని కేటీఆర్ అంటున్నారని, అసలు బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా? అని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ గెలిపిస్తారని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉంటే బీఆర్‌ఎస్ హయాంలో రూపొందించిన విగ్రహం దొరసానిలా ఉందన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో బంధించి.. కేటీఆర్, హరీశ్‌రావులు పిల్ల చేష్టలు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, చట్టం ఎవరికీ చుట్టం కాదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే ఎవరినీ సహించేది లేదని హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పదేళ్లలో తెలంగాణకు చేసిన మేలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment