పవన్‌ కల్యాణ్‌ను బీజేపీనే వద్దనుకుందా? | Is These Are The Main Reasons Behind Janasen Chief Pawan Kalyan Comments On NDA Exit - Sakshi
Sakshi News home page

ఎన్డీయే నుంచి బయటకు కాదు.. పవన్‌నే బీజేపీనే వద్దనుకుందా?

Published Thu, Oct 5 2023 12:43 PM | Last Updated on Thu, Oct 5 2023 1:19 PM

Is The Main Reason Behind Pawan Exits NDA Comments - Sakshi

సాక్షి, కృష్ణా: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడిని.. జనసేన అధినేత పవన్‌‍ కల్యాణ్‌ రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ పరామర్శించి వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చి రాగానే.. వచ్చే ఎన్నికలకు కలిసి వెళ్తామంటూ ప్రకటించి ఇరు పార్టీల క్యాడర్‌లను బిత్తరపోయే ప్రకటన చేశారు. ప్రకటనకు ఇది సమయమా? కాదా? అని ఆయన ఆలోచించుకోలేదన్నది అక్కడే అర్థమైంది. ఆపై ఆయన బాడీ లాంగ్వేజ్‌ పూర్తిగా మారిపోయిందన్నది వారాహి యాత్ర ప్రసంగాలతో అర్థమైపోతోంది. అబద్ధపు ప్రసంగాలతో ఊదరగొడుతున్నారాయన.  ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన మరో కామెంట్‌.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

వారాహి 4 యాత్రలో భాగంగా..  కృష్ణా జిల్లా పెడన బహిరంగ సభలో పవన్‌ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ‘‘ఎన్డీయేలో భాగస్వామి అయ్యి ఉండి కూడా.. చాలా ఇబ్బందులు ఉండి కూడా.. బయటికి రావడానికి టీడీపీ అనుభవమే ప్రధాన కారణం. జనసేన పోరాట పటిమకు టీడీపీ అనుభవం అవసరం’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఆధారంగా . ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్లు పవన్‌ స్వయంగా ప్రకటించేసినట్లయ్యింది. 

ఈ మధ్యకాలంలో.. పవన్‌ వ్యాఖ్యల గురించి ఏపీ బీజేపీ నేతలెవరూ స్పందించడం లేదు.పైగా పొత్తు అంశం జాతీయ నాయకత్వమే చూసుకుంటుందని దాటవేత సమాధానం ఇచ్చారు  ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి. కానీ, ఇదే పురందేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎంపికయ్యాక.. త్వరలో పవన్ తో భేటీ అవుతానని ప్రకటించారు. ఇక ఇప్పుడేమో ‘‘పవన్ ప్రతీ మాటకూ స్పందించాలా?’’ అని అంటున్నారు. ఎందుకు ఆమె వాయిస్‌ మారింది. ఈలోపే.. పవన్‌ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్లు ఎందుకు ప్రకటించారు?.. 

బాబు పెట్టిన చిచ్చే..
నిజంగా ఎన్డీయేలో పవన్‌ ఇబ్బందులు పడ్డారా? పడితే ఆ ఇబ్బందులు ఏంటి?.. అసలు ఎన్డీయే కూటమి నుంచి జనసేననే బయటకు వచ్చేసిందా?.. లేదంటే పరిస్థితులు, పవన్‌ తీరు వల్లే జనసేనను ఎన్డీయే కూటమి, బీజేపీ దూరం పెట్టేలా చేసిందా?.. 

1. గతంలో టీడీపీతో నడిచి ఘోరంగా భంగపడిన బీజేపీ.. దానిని దూరం పెడుతూ వస్తోంది. కనీసం ప్రతిపక్ష హోదా కోసమైనా ఈసారి జనసేనతో కలిసి నడవాలనే ఆలోచన చేసింది. కానీ, పవన్‌ చేజేతులారా ఆ అవకాశాన్ని పొగొట్టారు.

2. బీజేపీని-టీడీపీని ఒకే లైన్‌లోకి తేవాలని పవన్‌ మొదటి నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది బీజేపీకి మింగుడు పడని విషయం. పైగా విషయంపైనే ఆ మధ్య హస్తిన పర్యటనకు వెళ్లారు కూడా. కానీ, పవన్‌ ఉద్దేశం.. టీడీపీ పొత్తుపై అయిష్టత,  అంతకు మించి చంద్రబాబుతో పొంచి ఉన్న రాజకీయ ప్రమాదాన్ని అంచనా వేసిన బీజేపీ అందుకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి కీలక నేతలు సైతం పవన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని స్పష్టమవుతోంది. 

3. ప్రతిపక్ష ఇండియా కూటమికి కౌంటర్‌గా.. హస్తినలో జరిగిన బల ప్రదర్శనలో భాగంగానే ఎన్డీయే కూటమి పార్టీగా జనసేన తరపున పవన్‌ హాజరయ్యారు. మీటింగ్‌లోనూ సందడి చేశారు. దీంతో ప్రధానికి పవన్‌ దగ్గరంటూ జనసేన క్యాడర్‌ మురిసిపోయింది. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలే బీజేపీతో పవన్‌కు గ్యాప్‌ మరింత పెరిగేలా చేసినట్లు స్పష్టమవుతోంది. అందులో ప్రధాన కారణం.. చంద్రబాబు పార్టీతో పవన్‌ చేసిన పొత్తు ప్రకటన. 

4. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు దొరికింది పక్కా ఆధారాలతో. అందుకే ఆయన అరెస్ట్‌ వ్యవహారాన్ని బీజేపీ పట్టించుకోలేదు. తన తండ్రి అరెస్ట్‌ విషయంలో అటెన్షన్‌ కోసం ఢిల్లీ వెళ్లిన లోకేష్‌ను బీజేపీ తేలికగానే తీసుకుంది. అయితే.. అవినీతి కేసులో అరెస్ట్‌ అయిన మాజీ సీఎం చంద్రబాబును జైలుకు వెళ్లి కలవడమే కాకుండా.. మాటమాత్రమైనా చెప్పకుండా టీడీపీతో పొత్తుపై ప్రకటన చేసేశారు. దీంతో.. బీజేపీ ఆ అంశాన్ని మరింత తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. 

5. ప్యాకేజీ స్టార్‌ దత్త పుత్రుడనే విమర్శలకు మరింత బలం చేకూరుస్తూ.. టీడీపీ, చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలుస్తూ.. తరచూ కలుస్తూ వస్తున్నాడు. ఈ వ్యవహారాల్ని బీజేపీ నిశితంగా గమనిస్తూ వస్తోంది. చివరకు పొత్తు, ఇరు పార్టీలు కలిసి పని చేయాలనే తీర్మానాల నడుమ జనసేనను పక్కనపెట్టేయాలని నిర్ణయించేసింది.  కానీ, పవన్‌ మాత్రం టీడీపీ కోసమే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రజల చెవ్వుల్లో పువ్వులే పెట్టేలా ప్రకటన చేశారు. ఇకపై టీడీపీకి తానే పెద్ద దిక్కు అన్నట్లు చెబుతున్నారు. మరి ఆ మాటలకు ఆంతర్యం ఏంటో?..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement