కోల్‌కతా: ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి దేశ వ్యాప్తంగా పశ్చిమ బెంగాల్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎన్నడు లేని విధంగా ఈసారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 8 దశల్లో నిర్వహించారు. ఇక బెంగాల్‌లో విజయం సాధించడం కోసం బీజేపీ అన్ని రకాలుగా కృషి చేసింది. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. బెంగాల్ ప్రజలు మరోసారి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కే పట్టం కట్టారు.
కౌంటింగ్ కొనసాగుతున్నప్పటికి వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాల్లో 215 సీట్లలో టీఎంసీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు తెలుపుతున్నాయి. ఇక బీజేపీ 79 స్థానాల్లో ముందంజలో ఉంది. నందిగ్రామ్ రిజల్ట్‌పై ఉత్కంఠత కొనసాగుతుంది. బెంగాల్ టీఎంసీ విజయానికి దోహదం చేసిన అంశాలు ఇవే..
తక్కువ ఓటింగ్..
గతంతో పోల్చుకుంటే ఈ సారి బెంగాల్‌లో తక్కువ పోలింగ్ నమోదయ్యింది. కరోనాకు జడిసి చాలా మంది ఓటు వేయడానికి వెళ్లలేదు. తక్కువ పోలింగ్ నమోదైతే అధికార పార్టీకే లాభం జరుగుతుంది. బెంగాల్‌లో కూడా అదే జరిగింది.
బీజేపీకి సీఎం అభ్యర్థి లేకపోవడం..
బెంగాల్‌లో బీజేపీ ఓటమి పాలవ్వడానికి ప్రధాన కారణం.. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ నేతలు భారీగా అవినీతికి పాల్పడినట్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా దీదీని బెంగాల్ ప్రజలు ఆమోదించారు. ఇక బీజేపీ ప్రచార తీరును పరిశీలిస్తే.. స్థానిక నేతల కన్నా ఎక్కువగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచార బాధ్యతలు నిర్వహించారు. స్థానికులతో బలమైన సంబంధాలు కలిగి ఉండటంలో వీరు విఫలమయ్యారు.
కలిసి వచ్చిన బయటి వ్యక్తి నినాదం..
ఎన్నికల ప్రచరాంలో ప్రధానంగా దీదీ ‘‘బయటి వ్యక్తులు’’ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మోదీ-అమిత్ షాల ద్వయాన్ని ‘బయటి వ్యక్తులు’ అంటూ ఆమె చేసిన ప్రచారం ఫలించింది. బెంగాలీ జాతీయవాదం, రాష్ట్ర సంస్కృతి ‘బయటివారికి’ అర్థం కాదని ప్రజలకు స్పష్టంగా చెప్పడంలో దీదీ విజయం సాధించారు.
సంక్షేమ పథకాలు...
ఎన్నికల వేళ దీదీ ఇచ్చిన హామీలు కూడా ఆమెకు బాగా కలసి వచ్చాయి. ముఖ్యంగా నగదు పథకాలు జనాలను ప్రబలంగా ఆకర్షించాయి. వీటిలో ప్రధానమైనవి మహిళల కోసం ప్రకటించిన- కన్యాశ్రీ, రూపశ్రీ పథకాలు వారిపై బాగా ప్రభావం చూపాయి. ఇవే టీఎంసీ గెలుపును సుగమం చేశాయి. కన్యాశ్రీ పథకం కింద, ఒక ఆడపిల్ల 8వ తరగతికి చేరుకున్న తర్వాత రూ .25 వేలు.. రూపాశ్రీ పథకం ద్వారా 18 ఏళ్లు నిండినప్పుడు అమ్మాయి కుటుంబానికి రూ .25 వేలు ఇస్తామని దీదీ హామీ ఇచ్చారు.
ఇవే కాక ఉచిత బియ్యం, ఉచిత రేషన్ వంటి పథకాలు కూడా టీఎంసీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించాయి. గ్రామీణ ప్రాంతాల్లో టీఎంసీ ‘కట్-మనీ’, దోపిడీపై తీవ్ర ఆగ్రహం ఎదుర్కొంటున్నప్పటికి ఈ హామీలు టీఎంసీ విజయానికి దోహదం చేశాయి.
మమతకు మద్దతుగా సీపీఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు..
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 18 సీట్లు, 40 శాతం ఓట్లను దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన సీపీఎం-కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బెనర్జీ పక్షాన ఉన్నట్లు ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి తెలుపుతోంది. లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మమత బెనర్జీకి ఓటు షేర్ 6 శాతం పెరిగి 43 నుంచి 49 శాతానికి చేరింది. ఇక బీజేపీ విషయానికి వస్తే 40 శాతం నుంచి 37 శాతానికి పడిపోయింది.
ఇంతకుముందు సీపీఎం-కాంగ్రెస్ కలయికపై విశ్వాసం ఉంచిన ముస్లింలు ఇప్పుడు దీదీకి తమ పూర్తి మద్దతు తెలిపారు. దీనికి ప్రధాన కారణం పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఆమె దూకుడుగా ప్రచారం చేయడమే అంటున్నారు విశ్లేషకులు. ఈ సారి దీదీ ముస్లిం ఓట్లను గణనీయంగా రాబట్టుకోగలిగారు.
యాంటీ హిందూ రాజకీయాలు..
యాంటీ రాజకీయాలు బీజేపీకి కొంత లాభాలను తెచ్చినప్పటికి.. టీఎంసీకే అధికంగా మేలు చేశాయి. ఈ నినాదం బీజేపీ కొన్ని హిందూ ఓట్లను పొందడానికి సహాయపడింది. ముఖ్యంగా దక్షిణ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో దీని ప్రభావం బాగా ఉంది. అయతే ఇది బీజేపీ కంటే ఎక్కువగా మమతకే మేలు చేసింది. ముస్లింలు అందరూ టీఎంసీకే సామూహికంగా ఓటు వేయడానికి ఇది దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment