ప్రవల్లిక మృతిపై స్పందించిన ఖర్గే, రాహుల్‌.. ఏమన్నారంటే.. | Mallikarjuna Kharge And Rahul Gandhi Reacted To Group 2 Student Pravallika Death, Tweets Inside - Sakshi
Sakshi News home page

ప్రవల్లిక మృతిపై స్పందించిన ఖర్గే, రాహుల్‌.. ఏమన్నారంటే..

Published Sat, Oct 14 2023 2:52 PM | Last Updated on Sat, Oct 14 2023 3:31 PM

Mallikarjuna Kharge And Rahul Gandhi Reacted Pravallika Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 

గ్రూప్‌-2 పరీక్షల వాయిదాపై ఆందోళనతో తెలంగాణలో ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు స్పందించారు. ప్రవల్లిక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఇరువురు తెలంగాణలోని కేసీఆర్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ట్విట్టర్‌ వేదికగా స్పందించిన ఖర్గే..తెలంగాణలో విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతికి, తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను పదే పదే వాయిదా వేయడం, నిర్వహణలో అవకతవకల కారణంగా ప్రవల్లిక ఈ విపరీత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  ప్రవల్లిక కుటుంబానికి ఖర్గే సంతాపం ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా తెలంగాణలోని వేలాది మంది యువ ఔత్సాహికులు నిరాశకు గురవుతున్నారని, ఆగ్రహంగానూ ఉన్నారని అన్నారు. తెలంగాణ యువకులు అవినీతి, అసమర్థమైన బీఆర్ఎస్‌ను గద్దె నుంచి దించాలన్నారు.

మరోవైపు రాహుల్‌ గాంధీ కూడా ప్రవల్లిక మృతిపై ట్విట్టర్‌లో స్పందిస్తూ  ‘ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరం. ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. హత్య’ అని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ నిరుద్యోగ సమస్యతో విలవిలలాడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన నెల వ్యవధిలోనే TSPSCని పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.  

వరంగల్‌కు చెందిన ప్రవల్లిక (23) హైదరాబాద్‌లోని అశోక్‌ నగర్‌లో ఉన్న బృందావన్‌ గర్ల్స్‌ హాస్టల్‌లో ఉంటూ గ్రూప్‌–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతూండేది.  పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై హాస్టల్‌లో  ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్‌స్పెక్టర్‌ పి.నరేష్‌ వెంటనే అక్కడికి  చేరుకున్నారు.

మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్‌ లెటర్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.. సీఎం కేసీఆర్‌ డౌన్‌ డౌన్, కేటీఆర్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో విఫలమైన కేసీఆర్‌ సర్కార్‌ దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. టీఎస్సీఎస్సీని రద్దుచేసి యూపీఎస్సీకి ఇవ్వాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కూడా వారు నినదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement