
సాక్షి, హైదరాబాద్: సచివాలయ బిజినెస్ రూల్స్‌కి విరుద్ధంగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఫార్ములా ఈ–రేస్ ఒప్పందం, నిర్వహణపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏ విధమైన విధి విధానాలు పాటించకుండా, వ్యాపార సూత్రాలకు విరుద్ధంగా నెక్స్ జెన్ అనే కంపెనీకి లబ్ధి చేకూర్చడం కోసమే గతేడాది హైదరాబాద్‌లో ‘ఫార్ములా ఈ–రేస్’ నిర్వహించారని ఆరోపించారు.
వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉన్న ఈవెంట్ నిర్వహణ కోసం నాటి మంత్రి వర్గం, సంబంధిత శాఖ మంత్రి అనుమతి లేకుండా ఇటీవల బదిలీ అయిన పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రూ.55 కోట్లను ప్రైవేటు కంపెనీకి చెల్లించారని భట్టి తెలిపారు. ఈవెంట్ నిర్వహణకు రూ.110 కోట్లతో ఒప్పందం జరగగా, మిగిలిన రూ. 55 కోట్లను చెల్లించాలని సదరు కంపెనీ నోటీసు పంపిందన్నారు.
గత పాలకులు వారి కోరికలు తీర్చు కోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చాక ‘ఫార్ములా ఈ–రేసు’ను రద్దు చేయడంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు. మంగళవారం సచివాలయ మీడియా సెంటర్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆ రేస్ వల్ల రాష్ట్రానికి ఏం ఆదాయం వచ్చింది కేటీఆర్?
ఫార్మలా ఈ–రేసు రద్దుతో హైదరాబాద్ అభివృద్ధికి నష్టం జరిగిందని సోషల్ మీడియా ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ–రేస్‌తో హైదరాబాద్‌కు ఎలాంటి లాభం జరగలేదని, పైగా ప్రభుత్వ నిధులను అప్పనంగా ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారని విమర్శించారు. తమ ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయని, ప్రతిపైసా ప్రజల అవసరాల కోసం మాత్రమే తాము ఖర్చు చేస్తామన్నారు. వాళ్లు ఎవరో హైదరాబాద్‌కు వచ్చి వెళ్లడానికి రూ.100 కోట్లు కట్టాలా? అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం ఉండదని స్పష్టం చేశారు.
ప్రజాభవన్‌లో రోజూ నన్ను కలవచ్చు
ప్రజా పాలన అభయ హస్తం దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహించామని భట్టి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసి లబ్ధి పొందారన్నారు. ప్రజా భవన్‌లో ఎవరైనా తనను ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కలవవచ్చుని స్పష్టం చేశారు.
విడతల వారీగా రైతుబంధు నిధులు
రోజు వారీగా రైతు బంధు నిధులను విడుదల చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఒక ఎకరం ఉన్న రైతులకు ఇప్పటికే రైతు బంధు నిధులు చెల్లించామని, రెండు ఎకరాలున్న రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. విడతల వారీగా రైతులకు రైతుబంధు నిధులు ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment