బుధవారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క నేతృత్వంలోని సీఎల్పీ బృందం
భద్రాచలం అర్బన్: కరోనా వైరస్‌ను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సీఎల్పీ బృందం చేపట్టిన ఆస్పత్రుల సందర్శన కార్యక్రమాన్ని బుధవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ప్రారంభించారు. కరోనా బాధితులు చికిత్స పొందుతున్న ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. వారితో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే.. ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. మంగపేట మండలం గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమీప ప్రాంతాల్లో ఇటీవల వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. కరోనా బారిన పడిన బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మూడు రాష్ట్రాలకు తలమానికంగా ఉన్న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ఇలా అయితే రోగులకు సేవలెలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు. ఉండాల్సిన పోస్టుల్లో కనీసం 1/3 వంతు మంది కూడా లేరన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జ్వరాలు, ఇతర వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయని, ఇక్కడ కూడా సరైన వైద్య సిబ్బందిని నియమించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. సరిపడా సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ఏజెన్సీ వాసులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం వారిని గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో ప్రస్తావిస్తా..
ములుగు: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తామని చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఇంతటి దీనస్థితి ఎందుకు ఎదురవుతుందో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, మేడారం పర్యటన సందర్భంగా భట్టి విక్రమార్క, సీతక్కలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment