
బరూయ్‌పూర్‌లో సభలో మమత ప్రసంగం
ఖనాకుల్/కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మరో ఆరు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగానే, బీజేపీ విజయం తథ్యమని ప్రధాని మోదీ చెప్పడం పట్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ఫలితాలను ముందే చెప్పేయడానికి ఆయన ఏమైనా దేవుడా? సూపర్ మ్యానా? అని ప్రశ్నించారు. మైనార్టీల ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ ఓ వ్యక్తికి డబ్బులిస్తోందని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్‌ఎఫ్) వ్యవస్థాపకుడు అబ్బాస్ సిద్దిఖీపై పరోక్షంగా విమర్శలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలంటూ ప్రధాని మోదీ రాష్ట్ర అధికారులను ఆదేశిస్తున్నారని, తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ ఆదివారం హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు.
పలుచోట్ల ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించబోనని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఆరేళ్లుగా ప్రజలను కష్టాలపాలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయడం తప్ప వెలగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని కుళ్లిపోయిన పుష్పం అని మమతా బెనర్జీ అభివర్ణించారు.∙మోదీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి హేళనగా మాట్లాడుతున్నారని పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత శశి పంజా ఆదివారం విమర్శించారు. దీదీ ఓ దీదీ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారని ఆక్షేపించారు. ప్రధాని మోదీ కేవలం మమతా బెనర్జీనే కాదు మొత్తం బెంగాల్ మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మోదీకి గుణపాఠం చెప్పాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment