
మంథని నియోజకవర్గం
సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంధని నియోజకవర్గం నుంచి నాలుగోసారి విజయం సాదించారు. ఆయన సిటింగ్ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్టా మదుపై 16230 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతటా కాంగ్రెస్ ఓడిపోగా, ఒక్క శ్రీధర్ బాబే గెలవగలిగారు. 2014లో శ్రీధర్ బాబును మదు ఓడిరచగా, 2018లో శ్రీదర్ బాబు పైచేయి సాదించారు. శ్రీదర్ బాబుకు 89045 ఓట్లు రాగా, పుట్టా మధుకు 72815 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అభ్యర్ది కె.నాగార్జున కు 5400 పైగా ఓట్లు వచ్చి, మూడో స్థానంలో ఉన్నారు. శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత. ఈయన తండ్రి శ్రీపాదరావుకూడా మంథనినుంచి మూడుసార్లు గెలవగా, అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రదాని పివి నరసింహారావు నాలుగుసార్లు గెలిచారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు మొత్తం పదకుండు సార్లు గెలిచి నట్లయింది.
2014 ఎన్నికలలో దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఈసారి ఓటమిపాలయ్యారు. వరసగా మూడుసార్లు గెలుస్తూ వచ్చిన ఈయన టిఆర్‌ఎస్ ప్రభంజనానికి ఓటమి పాలు కాక తప్పలేదు. టిఆర్‌ఎస్ అభ్యర్ధి పుట్ట మధు ఇక్కడ శ్రీధర్ బాబుపై 19360 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. మధు అంతకుముందు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో ఉండి ఈ పార్టీలో చేరారు. 2009 ఎన్నికల సమయంలో ఈయన ప్రజారాజ్యం పక్షాన పోటీచేసి ఓడిపోయారు. శ్రీధర్‌బాబు డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో ఉన్నత విద్యాశాఖమంత్రి అయ్యారు. రోశయ్య మంత్రి వర్గంలో కూడా వున్నారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా శ్రీధర్‌బాబు మంత్రిగా కొనసాగారు. టరమ్ చివరిలో కిరణ్‌తో విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారు.
శ్రీధర్‌బాబు తండ్రి శ్రీపాదరావు 1991 నుంచి నాలుగేళ్లపాటు శాసనసభ స్పీకరుగా పనిచేశారు. ఆయనను నక్సలైట్లు హత్యచేశారు. శ్రీపాదరావు ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, మాజీ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసింది కూడా మంధని నియోజకవర్గం కావడం ఒక ప్రత్యేకత. పి.వి. ఇక్కడ నుంచి నాలుగుసార్లు ఎన్నికై, నీలం, కాసు క్యాబినెట్‌లలో మంత్రిగా, రాష్ట్రముఖ్యమంత్రిగా, ఆ తరువాత కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పదవీబాధ్యతలు చేపట్టారు. మూడు రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ఎన్నికైన నేతగా కూడా ప్రసిద్ధి గాంచారు. మన ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని హన్మకొండ, నంద్యాలతోపాటు, మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి, ఒరిస్సాలోని బరంపురం నుంచి కూడా ఆయన లోక్‌సభకు గెలుపొందారు.
మంథని నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment