
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికల అంశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వెలువడ్డాక తమ పార్టీలోకి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతాయనే ధీమాను ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ముఖ్యనేతలతో కొందరు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
బీజేపీలోకి మాజీ మంత్రి
మునుగోడు ఎన్నిక అనంతరం బీజేపీలో భారీగా చేరికలుంటాయని పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ 3 రోజుల కిందట తెలిపారు. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని సోమవారం మీడియా ప్రతినిధులతో లక్ష్మణ్ పిచ్చాపాటిగా మాట్లాడుతూ వెల్లడించారు. త్వరలోనే హైదరాబాద్ నగరానికి చెందిన మాజీ మంత్రి ఒకరు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైందన్నారు. దీంతో ఆ మాజీమంత్రి ఎవరనేది ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదు
కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నిక సెమీఫైనల్ కాదని, రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయని తాజాగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మరిన్ని ఊహాగానాలకు తావిస్తున్నాయి. టీఆర్‌ఎస్ సర్కార్‌పై వ్యతిరేకతను ఎత్తిచూపేందుకు, ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు ఇంకా ఒకటి, రెండు ఉప ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో సాగుతోంది. (క్లిక్ చేయండి: టీఆర్‌ఎస్‌ను వీడుతానన్న వార్తల్లో వాస్తవం లేదు)
Comments
Please login to add a commentAdd a comment