గణపతి లొంగుబాటు కట్టుకథ | Maoist Deny Ganapathi Surrender Reports Call It Center Conspiracy | Sakshi
Sakshi News home page

గణపతి లొంగుబాటు కట్టుకథ

Published Fri, Sep 4 2020 2:06 AM | Last Updated on Fri, Sep 4 2020 11:56 AM

Maoist Deny Ganapathi Surrender Reports Call It Center Conspiracy - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

 సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ స్పందిం చింది. ఇదంతా కల్పిత కథ అని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ గురువారం ఓ లేఖ విడుదల చేశారు. గణపతి లొంగు బాటు మొత్తం ఒక కట్టుకథ అని, ఇదంతా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మీడియాకు కావాలని ఇచ్చిన లీకు అని ఆరోపించారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మావో యిస్టు పార్టీ బలపడుతున్న క్రమంలో తమ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బ తీయడానికి ఆడిన ఆట అని అభివర్ణిం చారు. కామ్రేడ్‌ గణపతి వయోభారం, చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కారణంగా స్వచ్ఛందంగా తప్పుకుని, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించారని వివరించారు. ప్రపంచ చరిత్రలోని పోరాటాల్లో ఇదంతా స్వరసాధారణ మార్పు అని పేర్కొన్నారు. తమ నాయకత్వం దృఢంగా ఉండి ప్రభుత్వాలకు, పాలకవర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తుందోని.. అందుకే ఇలాంటి బూట కపు ప్రచారాలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు.

కార్పొరేట్‌ సేవలో తరిస్తున్నారు..
దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై, దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా.. మోదీ సర్కారుకు పట్టడం లేదని లేఖలో దుయ్యబట్టారు. కోవిడ్‌ ఉపద్రవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కోసం పెడచెవిన పెట్టారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ కాలంలో కార్పొరేట్‌ కంపెనీల సేవలో తరిస్తోందని ధ్వజమెత్తారు. వరవరరావు, సాయిబాబా వంటి ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారని.. కశ్మీర్‌ను మరో పాలస్తీనాగా మార్చారని మండిపడ్డారు. చైనాతో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమెరికా–చైనా వాణిజ్యపోరులో.. అమెరికా చేతిలో మోదీ పావులా మారారని పేర్కొన్నారు. 2022నాటి దేశంలో మావోల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర లక్ష్యం నెరవేరడం లేదని, ఆపరేషన్‌ సమాధాన్‌ను తట్టుకుని మావోయిస్టు పార్టీ నిలబడుతోందని స్పష్టంచేశారు. దేశంలో సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక్కటే శరణ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం మీడియా ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగుతోందని విమర్శించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement