Maoist central committee
-
హిడ్మా చనిపోలేదు.. సేఫ్‌గా ఉన్నాడు
బస్తర్: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ఎన్కౌంటర్లో పోలీసుల ప్రకటనపై ట్విస్ట్ చోటు చేసుకుంది. బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఒక లేఖ రిలీజ్ చేసింది. మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ మాడ్వి హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో వాస్తవం లేదంటూ ప్రకటించింది. బుధవారం జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే.. తాజాగా మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటి కార్యదర్శి పేరుతో లేఖ విడుదల అయ్యింది. అందులో ‘‘కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా చనిపోలేదు. చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. హిడ్మా సేఫ్ గా ఉన్నాడు.దక్షిణ బస్తర్ జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్లు సంయుక్తంగా డ్రోన్లు, హెలికాప్టర్ ద్వారా దాడులు చేశాయి. గత ఏడాది ఏప్రిల్ లో కూడా వైమానిక బాంబు దాడి చేశారు. మావోయిస్ట్ పార్టీ నాయకత్వంను దెబ్బతియాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు లేకుండా గగనతలం ద్వారా నిఘా పెట్టారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగంగానే మావోయిస్టులపై ఈ దాడులు, ప్రకటనలు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రపంచంలోనే అన్ని ప్రగతిశీల కూటములు ఏకం కావాలని, యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాల’’ని లేఖ ద్వారా మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలో పువర్తి గ్రామం స్థానికుడయిన హిడ్మా అక్కడి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి. దండకారణ్యంలో దాక్కున్న ఈ మావోయిస్టు అగ్రనేతను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున్న సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతంలోనూ హిడ్మా చనిపోయాడంటూ అనేకసార్లు ప్రచారం జరిగింది. హిడ్మా: చిక్కడు దొరకడు.. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? -
‘గడ్చిరోలి’ మృతుల్లో తేల్‌తుమ్డే
ముంబై/నాగ్‌పూర్: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన 26 మందిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. మర్దిన్‌తోలా అటవీప్రాంతంలోని కోర్చి సమీపంలో సి–60 పోలీస్ కమాండోలతో దాదాపు 10 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో మిలింద్ తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు శనివారం అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎల్గార్ పరిషత్–మావోయిస్ట్ లింకుల కేసు లో ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో 20 మంది పురుషులు కాగా ఆరుగురు మహిళలు. వీరిలో తేల్తుమ్డేకు బాడీగార్డులుగా వ్యవహరిస్తున్న ఒక మహిళ, పురుషుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు 29 ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రి, వాకీటాకీలు,విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల ముందే సమాచారం: కోర్చిలోని గ్యారపట్టి వద్ద మావోయిస్ట్‌ల శిబిరం ఉన్నట్లు తమకు రెండు రోజుల ముందే సమాచారం అందిందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ చెప్పారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సి–60 కమాండోలు, స్పెషల్ యాక్షన్ టీమ్‌లతోపాటు మొత్తం 300 మంది పోలీసు బలగాలు అదనపు ఎస్పీ సౌమ్య ముండే నేతృత్వంలో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ ప్రారంభించారన్నారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో వారికి తారసపడిన మావోయిస్టులు సుమారు 100 మంది అత్యాధునిక ఆయుధాలతో భారీ ఎత్తున కాల్పులకు దిగారన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్ట్‌లు చనిపోగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే సహా ఇప్పటి వరకు 16 మందిని గుర్తించినట్లు చెప్పారు. తేల్‌తుమ్డే తలపై రూ.50 లక్షల రివార్డు ఉందన్నారు. మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ మిలింద్ తేల్‌తుమ్డే మరణం దేశంలో మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ అని గడ్చిరోలి రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్(ఎంఎంసీ జోన్) పరిధిలో మావోయిస్ట్‌ల ఉద్యమానికి మిలింద్ కీలకంగా మారాడన్నారు. మహారాష్ట్రలో 20 ఏళ్లుగా నక్సల్ ఉద్యమం బలపడటంలో ఇతడు ముఖ్యుడని, ఇతడికి సాటి వచ్చే మావోయిస్ట్ నేతలు ఈ ప్రాంతంలో మరెవరూ లేరని చెప్పారు. ఎంఎంసీ జోన్ చీఫ్ ఇన్ఛార్జిగా, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మహారాష్ట్రకు చెందిన ఏకైక నేత ఇతడేనన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని కొండప్రాంతాల నుంచి ఎంఎంసీ జోన్ వైపు మళ్లించే బాధ్యతను కేంద్ర కమిటీ ఇతడికి అప్పగించిందని తెలిపారు. అటవీప్రాంతాలతోపాటు అర్బన్ నక్సల్ ఉద్యమంతో దగ్గరి సంబంధాలున్న మావోయిస్ట్ నేతల్లో మిలింద్ తేల్‌తుమ్డే ఒకడని చెప్పారు. మిలింద్ తేల్‌తుమ్డే హక్కుల కార్యకర్త ఆనంద్ తేల్తుమ్డేకు సోదరుడు. ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ లింకుల కేసులో అరెస్టయిన ఆనంద్ ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో మిలింద్‌ను ప్రమాదకరమైన మావోయిస్ట్‌గా పేర్కొంది. మహారాష్ట్రలో 1996 నుంచి కొనసాగుతున్న మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఇతనికి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఇతడిపై గత ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర భద్రతా విభాగాలు ఒక కన్నేసి ఉంచాయి. అజ్ఞాతంలో ఉన్న ఇతడు అనిల్, దీపక్, సహ్యాద్రి, కామ్రేడ్ ఎం.. వంటి పేర్లతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. బిహార్‌లో నక్సలైట్ల దాడిలో నలుగురి మృతి గయ(బిహార్): బిహార్‌లో నక్సలైట్లు ఓ ఇంటిని బాంబులతో పేల్చివేయడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గయ జిల్లా దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలో బిహార్–జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. మావోయిస్టులు శనివారం రాత్రి సర్యూసింగ్ భోక్తా ఇంట్లో బాంబు అమర్చి పేల్చేశారు. ఆ సమయంలో సర్యూసింగ్ ఇంట్లో లేరు. పేలుడుతో సర్యూసింగ్ ఇద్దరు కుమారులు, వారి భార్యలు మృతిచెందారు. మృతదేహాలను నక్సలైట్లు పశువుల దొడ్డిలో స్తంభానికి వేలాడదీశారు. ఘటనా స్థలంలో ఒక కరపత్రాన్ని వదిలి వెళ్లారు. సర్యూసింగ్, ఆయన కుటుంబం పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నందున వారిని శిక్షించామని అందులో పేర్కొన్నారు. -
గణపతి లొంగుబాటు కట్టుకథ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోతున్నాడంటూ వస్తున్న వార్తలపై ఎట్టకేలకు మావోయిస్టు పార్టీ స్పందిం చింది. ఇదంతా కల్పిత కథ అని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ గురువారం ఓ లేఖ విడుదల చేశారు. గణపతి లొంగు బాటు మొత్తం ఒక కట్టుకథ అని, ఇదంతా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మీడియాకు కావాలని ఇచ్చిన లీకు అని ఆరోపించారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మావో యిస్టు పార్టీ బలపడుతున్న క్రమంలో తమ పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బ తీయడానికి ఆడిన ఆట అని అభివర్ణిం చారు. కామ్రేడ్ గణపతి వయోభారం, చిన్నచిన్న ఆరోగ్య సమస్యల కారణంగా స్వచ్ఛందంగా తప్పుకుని, ఆ బాధ్యతలను ఇతరులకు అప్పగించారని వివరించారు. ప్రపంచ చరిత్రలోని పోరాటాల్లో ఇదంతా స్వరసాధారణ మార్పు అని పేర్కొన్నారు. తమ నాయకత్వం దృఢంగా ఉండి ప్రభుత్వాలకు, పాలకవర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తుందోని.. అందుకే ఇలాంటి బూట కపు ప్రచారాలు పుట్టుకొస్తున్నాయని విమర్శించారు. కార్పొరేట్ సేవలో తరిస్తున్నారు.. దేశ ఆర్థిక వ్యవస్థ పతనమై, దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నా.. మోదీ సర్కారుకు పట్టడం లేదని లేఖలో దుయ్యబట్టారు. కోవిడ్ ఉపద్రవంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం పెడచెవిన పెట్టారని ఆరోపించారు. లాక్డౌన్ కాలంలో కార్పొరేట్ కంపెనీల సేవలో తరిస్తోందని ధ్వజమెత్తారు. వరవరరావు, సాయిబాబా వంటి ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అణిచివేస్తున్నారని.. కశ్మీర్‌ను మరో పాలస్తీనాగా మార్చారని మండిపడ్డారు. చైనాతో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అమెరికా–చైనా వాణిజ్యపోరులో.. అమెరికా చేతిలో మోదీ పావులా మారారని పేర్కొన్నారు. 2022నాటి దేశంలో మావోల నిర్మూలన లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర లక్ష్యం నెరవేరడం లేదని, ఆపరేషన్ సమాధాన్‌ను తట్టుకుని మావోయిస్టు పార్టీ నిలబడుతోందని స్పష్టంచేశారు. దేశంలో సమస్యలు పెరిగిపోతున్నాయని, ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఒక్కటే శరణ్యమని ప్రజలు భావిస్తున్న తరుణంలో మోదీ ప్రభుత్వం మీడియా ద్వారా ఇలాంటి అసత్య ప్రచారాలకు దిగుతోందని విమర్శించారు. -
గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ
-
గణపతి లొంగుబాటు : కేంద్ర కమిటీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై ఆ పార్టీ తొలిసారి స్పందించింది. గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథగా కొట్టిపారేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రెండు పేజీల లేఖను గురువారం విడుదల చేసింది. గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని పేర్కొంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకంలో మీడియా పావులుగా వాడుకున్నారని లేఖలో స్పష్టం చేసింది. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారని లేఖ ద్వారా వివరించింది. కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడని పేర్కొంది. (గణపతి ఎక్కడ?) ‘సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాం. మా నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారు. ఈ కట్టుకథలు పై మీడియా ప్రచారం చేయడం సరికాదు. ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపతుడున్న గణపతి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ స్పందించి ఆ వార్తలను కొట్టిపారేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన 73 ఏళ్ల గణపతి 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?) -
కీలక నిర్ణయం తీసుకోనున్న మావో గణపతి
సాక్షి, కరీంనగర్: మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోయేందుకు యత్నిస్తున్నట్టు వార్తలు రావడం సంచలనంగా మారింది. సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా పనిచేసిన గణపతి వయసురిత్యా పోరాటానికి స్వస్తి పలికే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులతో మంతనాలు జరుపుతున్న ఆయన కీలక నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా, 74 ఏళ్ల గణపతి తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మోకాళ్ల నొప్పులు, మధుమేహంతో సమస్యలు ఆయనను వెంటాడుతున్నాయి. గణపతి స్వస్థలం జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామం. ఇక ఎంపీసీ, నక్సలైట్ పార్టీల విలీనం తర్వాత కేంద్ర కార్యదర్శిగా గణపతి పనిచేశారు. అనారోగ్య కారణాలతో 2018 లో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన అనంతరం నంబాల కేశవరావు కేంద్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అనారోగ్య సమస్యలతో సతమవుతున్న గణపతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి రాగానే లొంగుబాటుకు సిద్ధమవుతారని గత రాత్రి నుంచి కరీంనగర్ వ్యాప్తంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన లొంగుబాటు నిజమే అయితే విప్లవోద్యమ చరిత్రలో పెద్ద కుదుపుగానే భావించాలి. మరోవైపు గణపతితోపాటు మరో నలుగురు మవోయిస్టు నేతలు కూడా లొంగుబాటు దిశగా పయనిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. (చదవండి: మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!) -
మావోయిస్టు కేంద్ర కమిటీ.. 10 మంది వారే..!
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో భారీ సంస్థాగత మార్పులు జరిగినట్టు తెలిసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా నంబాల కేశవరావు (69) అలియాస్ బస్వరాజ్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి కావడంతో కేంద్ర కమిటీలో భారీ ప్రక్షాళన చేసినట్టు సమాచారం. 21 మంది సభ్యులతో నూతన కేంద్రకమిటీ ఏర్పాటైందని.. కమిటీలో తెలంగాణకు చెందిన 10 మంది, జార్ఖండ్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరు చొప్పున, బీహార్ నుంచి ఒకరికి అవకాశం కల్పించినట్టు వెల్లడైంది. తెలంగాణా నుంచి 10మంది.. 1. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, కరీంనగర్. 2. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ వివేక్, కరీంనగర్. 3. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, ఆదిలాబాద్. 4. మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, కరీంనగర్. 5. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కరీంనగర్. 6. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా, కరీంనగర్. 7. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ , హైదరాబాద్. 8. పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, కరీంనగర్. 9. గాజర్ల రవి అలియాస్ గణేష్, వరంగల్. 10. పాక హనుమంతు అలియాస్ ఉకే గణేష్, నల్గొండ. -
మావోయిస్టు కొత్త కమిటీ.. తెలంగాణకు పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉద్యమ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మావోయిస్టు పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే మంగళవారం నూతన కేంద్ర కమిటీని ఎన్నుకుంది. 21 మందితో మావోయిస్టు కేంద్ర కమిటీ జాబితా సిద్ధం చేసింది. నూతన కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి 10 మందికి స్థానం లభించింది. అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుంచి ఇద్దరి చొప్పున చోటు దక్కింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా పార్టీ సీనియర్ నేత నంబాల కేశవరావును (69) అలియాస్ బస్వరాజ్‌ను ప్రధాన కార్యదర్శిగా పార్టీ నియమించింది. -
విశాఖ టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్చరిక
-
మావోయిస్ట్ చీఫ్‌గా బసవరాజ్
సాక్షి, హైదరాబాద్ : మావోయిస్ట్ చీఫ్ ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి) స్ధానంలో శ్రీకాకుళంకు చెందిన నంబళ్ల కేశవరావు ఎంపికయ్యారు. వయోభారం కారణంగా గణపతి (72)ని పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైదొలగాలని మావోయిస్ట్ కేంద్ర కమిటీ కోరింది. బసవరాజ్‌గా పార్టీ వర్గాలు పిలుచుకునే కేశవరావు (63) కేంద్ర మిలిటరీ కమిషన్ సారథిగా వ్యవహరిస్తున్నారు.విద్యార్ధి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పట్టభద్రులు కావడం గమనార్హం. కాగా గణపతి తలపై రూ 49 లక్షల రివార్డు ప్రకటించగా, బసవరాజ్‌కు పట్టిఇచ్చిన వారికి రూ 36 లక్షల రివార్డును పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. మరోవైపు రెండు నెలల కిందటే మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పు చోటుచేసుకుందని తెలంగాణ పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. అరకులో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యకు బసవరాజు వ్యూహం రూపొందించారని తాము భావిస్తున్నామని తెలిపాయి. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న గణపతి స్ధానంలో చురుకుగా ఉండే యువ నేతను ఎంపిక చేసుకునేందుకు వీలుగా పార్టీ పగ్గాలను వీడాలని గణపతికి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయడంతో నాయకత్వ మార్పు జరిగిందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సైన్స్, బీఈడీల్లో గ్రాడ్యుయేట్ అయిన భూస్వామ్య రైతు కుటుంబానికి చెందిన గణపతి మూడు దశాబ్ధాలుగా మావోయిస్టు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు. -
మావోల లేఖ: వారు ఆదివాసీలు కాదు.. ద్రోహులు!
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ అధికార ప్రతినిధి జగబందు పేరుతో మావోలు లేఖలు విడుదల చేశారు. రాజకీయ నేతలకు, దళారీలను ఆ లేఖలో గట్టిగా హెచ్చరించారు. బాక్సైట్ పేరుతో మంత్రి పబ్బం గడుపుకుంటున్నారు ‘మైనింగ్ మాఫియాగా మారి, ఆదివాసీల ప్రాకృతిక సంపదను అప్పన్నంగా కొల్లగొడుతున్నందుకే అరకు ఎమ్మెల్మే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలను హతమార్చాం. కిడారి, సోమాలు ఆదివాసీలు కాదు.. ద్రోహులు, సామ్రాజ్యవాద బహుళ జాతీ కంపెనీలకు దళారులు. కిడారి రోజుకో పార్టీ మారుతూ సంపాదనే ధ్యేయంగా బరితెగించారు. నాతవరం మండలంలో లేటరైట్ పేరుతో బాక్సైట్ ఖనిజాన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు, కొడుకు విజయ్‌లు వాటాలతో పబ్బం గడుపుకుంటున్నారు. మన్య ప్రాంత సంపద అక్రమ తరలింపు ఆపకపోతే జరిగే పరిణామాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే’అంటూ మావోలు లేఖలో పేర్కొన్నారు. ఇక గత కొద్ది నెలలుగా ఆంధ్రా-ఒడిశా బార్డర్ (ఏవోబీ) వద్ద మావోయిస్టులు కదలికలు ఏపీ పోలీసులకు చాలెంజ్‌గా మారింది. -
మీనా ఎన్కౌంటర్.. స్పందించిన మావోలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)వద్ద ఈ నెల 12 జరిగిన మావోయిస్టు దళ మహిళా డిప్యూటీ కమాండర్ మీనా ఎన్కౌంటర్, మరి కొంత మంది అరెస్ట్‌లపై మావోయిస్టు కేంద్ర కమిటీ ఆడియో టేప్ విడుదల చేశారు. ఏవోబీ డివిజన్ కార్యదర్శి కైలాష్ అలియాస్ చలపతి పేరిట రిలీజ్ చేసిన ఆడియో టేప్‌లో సరిహద్దుల్లో పోలీసుల ప్రవర్తిస్తున్న తీరును తప్పుబట్టారు. ‘కామ్రేడ్ మీనా మృతి మావోయిస్టు పార్టీకి తీరని లోటు. ఆ లోటును భర్తీ చేసుకుంటూ అమరులైన వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. శత్రువులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రే హౌండ్స్ పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టి ఏకదాటిగా రాపిడ్ ఫైరింగ్ చేశారు. ఆ ఫైరింగ్‌కు తూటాలు తగిలిన మీనా తీవ్రంగా గాయపడింది. గ్రే హౌండ్స్ పోలీస్లే మీనాను హత్య చేశారు. గత వారం రోజుల నుంచి కాల్పులతో పోలీస్‌లు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కట్ ఆఫ్ ఏరియాలో ప్రధానంగా ఆంధ్రలో పెద బయలు, ముంచంగిపుట్టు, ఒడిశాలోని మల్కన్ గిర, ఆండ్రపల్లి, జంత్రీ వంటి గిరిజన గ్రామాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఆండ్రపల్లిలోని మహిళలందరినీ హింసించారు. పోలీసులు ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులను నిర్బంధించారు. వారిని బేషరతుగా విడుదల చేయాలి’అంటూ ఆడియో టేప్‌లో మావోలు కోరారు. చదవండి: ‘గిడ్డి ఈశ్వరి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది’ ఎదురుకాల్పులతో దద్దరిల్లిన ఏవోబీ తూర్పుకొండల్లో.. మావోగన్స్ ఘాతుకం -
గిడ్డి ఈశ్వరిని హెచ్చరించిన మావోయిస్టులు..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద గత నెల 23న దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖ విడుదల చేశారు. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయినందునే కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసినందునే సివేరి సోమలను హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాన పత్రికల సంపాదకుల పేరిట మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మంగళవారం రాత్రి ఈ లేఖను విడుదల చేసింది. ‘‘గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులైన కిడారి, సివేరి సోమలను సెప్టెంబర్ 23న ప్రజాకోర్టులో శిక్షించాం. గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించినా అధికారపార్టీకి తొత్తులుగా మారి మా హెచ్చరికలను లెక్క చేయకపోవడమేగాక బాక్సైట్ తవ్వకాలకు లోలోపల ప్రభుత్వానికి సహకరించినందువల్లే శిక్షను అమలు చేశాం. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయిన ప్రజాద్రోహి కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసిన సివేరిలను కఠినంగా శిక్షించాం. ప్రజల సమక్షంలోనే వారు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. అందుకే శిక్షలను అమలు చేశాం..’’ అని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. పోలీసునుద్దేశించి మావోయిస్టులు లేఖలో ప్రస్తావిస్తూ.. ‘‘ఆరోజు పోలీసు సోదరులు మాకు ఆయుధాలతో చిక్కినా వారిని చంపలేదు. పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తున్నారని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాం. అదే మా విప్లవ సోదరులు మీకు దొరికితే దొంగకథలల్లి వాళ్లను నిస్సహాయులను చేసి ఎన్కౌంటర్ చేస్తారు కదా! మరి మీరు మా మాదిరి చేయగలరా? ఆలోచించండి..’’ అని కోరారు. మావోయిస్టులు విడుదల చేసిన బహిరంగ లేఖ రూ.20 కోట్లకు అమ్ముడుబోయిన గిడ్డి మాకు నీతులు చెప్పడమా? ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికారపార్టీకి తొత్తు అయిన గిడ్డి ఈశ్వరి తమను నిందించడమేంటని మావోయిస్టులు మండిపడ్డారు. రూ.20 కోట్లకు అధికారపార్టీకి అమ్ముడుపోయిన నువ్వు మాకు నీతులు చెప్పడమా? అని ధ్వజమెత్తారు. ‘ప్రజాకోర్టులో కిడారి నీ విషయంపై నిజం చెప్పాడు. నీకందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచి క్షమాపణలు చెప్పాలి. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించాలి. లేదంటే నీకూ కిడారి, సోమలకు పట్టిన గతే పడుతుంది. మేము చెప్పినట్లు చేస్తావు కదా! లేదంటే మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా.. ఆలోచించుకో’’ అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు చేశారు. -
మావో పార్టీలో పునర్వ్యవస్థీకరణ
కోల్‌కతా: నిషేధిత సీపీఐ–మావోయిస్టు పార్టీలో పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇందులో భాగంగా వృద్ధ నేతలకు విరామం ఇచ్చి, వారి సేవలను ఇతర రంగాల్లో వినియోగించుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో పార్టీ కేంద్ర నాయకత్వం సమావేశమై ఈ దిశగా చర్యలను ప్రారంభించింది. ఈ వివరాలున్న మూడు పేజీల సర్క్యులర్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ వివిధ అనుబంధ విభాగాలకు అందజేసింది. ఉద్యమ అవసరాల రీత్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొంది. భద్రతా బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్న ప్రాంతాల్లో చురుగ్గా వ్యవహరించలేని అజ్ఞాతంలో ఉన్న సీనియర్ నేతలను రక్షించుకోవటం కూడా కీలకమని అందులో పేర్కొంది. పార్టీ నిర్దేశించిన విధులను సరిగ్గా నిర్వహించలేని వృద్ధ నేతలను, శారీరకంగా చురుగ్గా లేని వారిని గుర్తించాలని ఆ సర్క్యులర్‌లో కోరింది. వారిని బాధ్యతల నుంచి తప్పించి పార్టీ అనుబంధ సంఘాల ఏర్పాటు, ఇతర ప్రాంతాల్లో ఉద్యమ నిర్మాణం బాధ్యతలను అప్పగించాలని సూచించింది. అయితే, ఇందుకు వయో పరిమితిని మాత్రం నిర్దేశించలేదు. సీపీఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావుకు 67 ఏళ్లు, తూర్పు ప్రాంత బ్యూరో ప్రశాంత్ బోస్ అలియాస్ కిషన్ దా వయస్సు 72 ఏళ్లు, కేంద్ర మిలటరీ కమిషన్ చీఫ్ వాసవరాజ్కు 62 ఏళ్లు కావటం గమనార్హం. అయితే, ఇలాంటి ప్రక్షాళన మావోయిస్టు పార్టీకి కొత్తేమీ కాదని పశ్చిమబెంగాల్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో 1960–70లలో కూడా ఇలాంటివి జరగాయని తెలిపారు. అప్పట్లో సీనియర్ నేతల సేవలను ఉద్యమ సమావేశాలు వంటివి నిర్వహించటానికి వినియోగించుకున్నారన్నారు. -
బతుకమ్మలోగా లొంగిపోతే రూ. 2 కోట్లు
- మావోయిస్టు అగ్రనేత వేణుకు ఆఫర్ - ‘మల్లోజుల’ తల్లిని కలిసిన పోలీస్‌బాస్ - మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని పిలుపు పెద్దపల్లి: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణు అలియాస్ భూపతి అలియాస్ సోను లొంగిపోవాలని ఎస్పీ శివకుమార్ పేర్కొన్నారు. బతుకమ్మలోగా జనజీవన స్రవంతిలో కలిస్తే వేణుపై వివిధ రాష్ట్రాల్లో ఉన్న రూ. 2 కోట్ల రివార్డు ఆయనకే దక్కేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వేణు తల్లి మధురమ్మను పెద్దపల్లిలో సోమవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో వెళ్లి ఎస్పీ కలిశారు. ఇప్పటికే పెద్దకొడుకు కిషన్‌జీ ఉద్యమంలో అసువులు బాసాడని, రెండో కొడుకు వేణు ఇంటికొచ్చేలా చూడాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. నక్సలైట్ల చేతిలో మరణించిన కుటుంబాలకు పెద్దఎత్తున పరిహారం ఇచ్చేందుకు, ఇదే సమయంలో అజ్ఞాతవాసంలో ఉన్న జిల్లాకు చెందిన 32మంది నక్సలైట్లకు పునరావాసం, రివార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కోలుకోలేదని, ఐదారేళ్లుగా రిక్రూట్మెంట్ ఆగిపోయిందని ఎస్పీ తెలిపారు. మిగిలిన నక్సలైట్లంతా లొంగిపోయి రివార్డులతో ప్రశాంత జీవనం గడపాలని కోరారు. ఓఎస్డీ సుబ్బారాయుడు, డీఎస్పీ వేణుగోపాల్‌రావు, నగరపంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య, జెడ్పీటీసీ యాట దివ్య, ఎంపీపీ సునీత తదితరులున్నారు.