బతుకమ్మలోగా లొంగిపోతే రూ. 2 కోట్లు
- మావోయిస్టు అగ్రనేత వేణుకు ఆఫర్
- ‘మల్లోజుల’ తల్లిని కలిసిన పోలీస్‌బాస్
- మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని పిలుపు
పెద్దపల్లి: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణు అలియాస్ భూపతి అలియాస్ సోను లొంగిపోవాలని ఎస్పీ శివకుమార్ పేర్కొన్నారు. బతుకమ్మలోగా జనజీవన స్రవంతిలో కలిస్తే వేణుపై వివిధ రాష్ట్రాల్లో ఉన్న రూ. 2 కోట్ల రివార్డు ఆయనకే దక్కేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
వేణు తల్లి మధురమ్మను పెద్దపల్లిలో సోమవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో వెళ్లి ఎస్పీ కలిశారు. ఇప్పటికే పెద్దకొడుకు కిషన్‌జీ ఉద్యమంలో అసువులు బాసాడని, రెండో కొడుకు వేణు ఇంటికొచ్చేలా చూడాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. నక్సలైట్ల చేతిలో మరణించిన కుటుంబాలకు పెద్దఎత్తున పరిహారం ఇచ్చేందుకు, ఇదే సమయంలో అజ్ఞాతవాసంలో ఉన్న జిల్లాకు చెందిన 32మంది నక్సలైట్లకు పునరావాసం, రివార్డులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ కోలుకోలేదని, ఐదారేళ్లుగా రిక్రూట్‌మెంట్ ఆగిపోయిందని ఎస్పీ తెలిపారు. మిగిలిన నక్సలైట్లంతా లొంగిపోయి రివార్డులతో ప్రశాంత జీవనం గడపాలని కోరారు. ఓఎస్డీ సుబ్బారాయుడు, డీఎస్పీ వేణుగోపాల్‌రావు, నగరపంచాయతీ చైర్మన్ ఎల్.రాజయ్య, జెడ్పీటీసీ యాట దివ్య, ఎంపీపీ సునీత తదితరులున్నారు.