మళ్లీ మావోయిస్టుల
⇒ మిడ్జిల్, వంగూర్ మండలాల్లో వెలసిన పోస్టర్లు
⇒ అప్రమత్తమైన పోలీసులు
⇒అజ్ఞాతంలో జిల్లా నుంచి ఏడుగురు మావోయిస్టులు
⇒మాజీల కదలికలపై మరింత నిఘా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మావోయిస్టుల పేరిట మిడ్జిల్, వంగూరు మండలాల్లో సోమవారం పోస్టర్లు దర్శనమీయడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా తుడిచి పెట్టామని పోలీసులు ప్రకటించిన 20 రోజుల్లోనే పోస్టర్లు వెలుగు చూశాయి. పోస్టర్లలో వాడిన భాష, అంశాలు తీవ్ర స్థాయిలో ఉండటం స్థానికంగా చర్చనీయాంశమైంది. సుమారు దశాబ్దం క్రితం మావోయిస్టులకు పట్టున్న వంగూరు, పోల్కంపల్లి, రంగాపూర్‌తో పాటు మిడ్జిల్, ముచ్చర్లపల్లి, ఊర్కొండలో పోస్టర్లు వెలిశాయి. దీంతో ఇన్నాళ్లూ సద్దుమణిగిన మావోయిస్టుల కార్యకలాపాలు మరోమారు తెరమీదకు వచ్చాయి. గతంలో నల్లమల కేంద్రంగా జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహించిన మావోయిస్టుల పట్టు 2004 తర్వాత క్రమంగా సన్నగిల్లుతూ వచ్చింది.
గత నెల 19న ప్రకాశం జిల్లా మురారికురువ వద్ద నల్లమల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జానా బాబూరావుతో పాటు నాగమణి అలియాస్ కవిత, కల్పన మరణించారు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న దారగోని శ్రీనివాస్ అలియాస్ విక్రమ్ ఈ నెల రెండో తేదీన జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయాడు. విక్రమ్ లొంగుబాటుతో జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తుడిచి వేశామని జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ స్వయంగా ప్రకటించారు. ఇటీవల మిడ్జిల్ మండలంలో మావోయిస్టుల పేరిట పోస్టర్లు వెలిసినా ‘నకిలీ’ల పనంటూ పోలీసులు కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు మళ్లీ పోస్టర్లు మరోమారు దర్శన మీయడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
మాజీల కదలికలపై దృష్టి?
మావోయిస్టు కార్యకలాపాల్లో జిల్లా నుంచి పలువురు క్రియాశీలంగా పాల్గొన్నా తర్వాత కాలంలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. మరికొందరు లొంగుబాటు ప్రకటించి సాధారణ జన జీవితం గడుపుతున్నారు. పోలీసు యంత్రాంగం లెక్కల ప్రకారం ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో జిల్లాకు చెందిన ఏడుగురు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. చాకలి నిరంజన్ (కోనాపూర్, అమన్‌గల్ మండలం), పోతుల కల్పన (పెంచికలపాడు, గట్టు మండలం), నార్ల శ్రీవిద్య (దేవుని తిరుమలాపూర్, పెద్దకొత్తపల్లి), బొడ్డుపల్లి పద్మ (ఎలికల్, వెల్దండ మండలం), బొంత పార్వతమ్మ (బీకే లక్ష్మాపూర్, అమ్రాబాద్), విశ్వనాథ్, సక్కుబాయి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. తాజాగా మావోయిస్టుల పేరిట పోస్టర్లు వెలియడంతో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులతో పాటు, మాజీల కదలికలపైనా నిఘా వేస్తున్నట్లు సమాచారం. సంబంధిత గ్రామాలను సందర్శించిన పోలీసులు అధికారులు పరిస్థితిని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం.