సాక్షి, హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటు వార్తలపై ఆ పార్టీ తొలిసారి స్పందించింది. గత మూడు రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలను మావోయిస్టు కేంద్ర కమిటీ ఖండించింది. గణపతి సరెండర్ పోలీసుల కల్పిత కథగా కొట్టిపారేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో రెండు పేజీల లేఖను గురువారం విడుదల చేసింది. గణపతి సరెండర్ ఒక హైటెన్షన్ కల్పిత కథ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకమని పేర్కొంది. తెలంగాణ, చత్తీస్‌గఢ్ ఇంటెలిజెన్స్ అధికారుల కట్టు కథలతో పాటు, పోలీసులు అల్లిన నాటకంలో మీడియా పావులుగా వాడుకున్నారని లేఖలో స్పష్టం చేసింది. కామ్రేడ్ గణపతి చిన్న చిన్న అనారోగ్య కారణాల రీత్యా స్వచ్ఛందంగా బాధ్యతల నుంచి తప్పుకున్నారని లేఖ ద్వారా వివరించింది. కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాడని పేర్కొంది. (గణపతి ఎక్కడ?)
‘సిద్ధాంత పరంగా, రాజకీయంగా మా నాయకత్వం దృఢంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాం. మా నాయకత్వపు ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే ఇటువంటి కట్టుకథలు అల్లుతున్నారు. ఈ కట్టుకథలు పై మీడియా ప్రచారం చేయడం సరికాదు. ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా అనారోగ్య సమస్యలతో బాధపతుడున్న గణపతి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం జాతీయ స్థాయిలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ స్పందించి ఆ వార్తలను కొట్టిపారేసింది. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన 73 ఏళ్ల గణపతి 40 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. (మావో గణపతి.. ఎప్పుడొచ్చారు?)
Comments
Please login to add a commentAdd a comment