ముంబై/నాగ్‌పూర్: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 26 మందిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుమ్డే ఉన్నట్లు పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. మర్దిన్‌తోలా అటవీప్రాంతంలోని కోర్చి సమీపంలో సి–60 పోలీస్ కమాండోలతో దాదాపు 10 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లింది.
ఈ ఘటనలో చనిపోయిన వారిలో మిలింద్ తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు శనివారం అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎల్గార్ పరిషత్–మావోయిస్ట్ లింకుల కేసు లో ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే కూడా ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. మృతుల్లో 20 మంది పురుషులు కాగా ఆరుగురు మహిళలు. వీరిలో తేల్‌తుమ్డేకు బాడీగార్డులుగా వ్యవహరిస్తున్న ఒక మహిళ, పురుషుడు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు 29 ఆయుధాలతోపాటు మందుగుండు సామగ్రి, వాకీటాకీలు,విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
రెండు రోజుల ముందే సమాచారం: కోర్చిలోని గ్యారపట్టి వద్ద మావోయిస్ట్‌ల శిబిరం ఉన్నట్లు తమకు రెండు రోజుల ముందే సమాచారం అందిందని గడ్చిరోలి ఎస్‌పీ అంకిత్ గోయెల్ చెప్పారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సి–60 కమాండోలు, స్పెషల్ యాక్షన్ టీమ్‌లతోపాటు మొత్తం 300 మంది పోలీసు బలగాలు అదనపు ఎస్‌పీ సౌమ్య ముండే నేతృత్వంలో గురువారం రాత్రి నుంచి కూంబింగ్ ప్రారంభించారన్నారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో వారికి తారసపడిన మావోయిస్టులు సుమారు 100 మంది అత్యాధునిక ఆయుధాలతో భారీ ఎత్తున కాల్పులకు దిగారన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్ట్‌లు చనిపోగా, నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. మృతి చెందిన 26 మందిలో తేల్‌తుమ్డే సహా ఇప్పటి వరకు 16 మందిని గుర్తించినట్లు చెప్పారు. తేల్‌తుమ్డే తలపై రూ.50 లక్షల రివార్డు ఉందన్నారు.
మావోయిస్ట్ పార్టీకి పెద్ద దెబ్బ
మిలింద్ తేల్‌తుమ్డే మరణం దేశంలో మావోయిస్ట్ ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ అని గడ్చిరోలి రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్(ఎంఎంసీ జోన్) పరిధిలో మావోయిస్ట్‌ల ఉద్యమానికి మిలింద్ కీలకంగా మారాడన్నారు. మహారాష్ట్రలో 20 ఏళ్లుగా నక్సల్ ఉద్యమం బలపడటంలో ఇతడు ముఖ్యుడని, ఇతడికి సాటి వచ్చే మావోయిస్ట్ నేతలు ఈ ప్రాంతంలో మరెవరూ లేరని చెప్పారు. ఎంఎంసీ జోన్ చీఫ్ ఇన్‌ఛార్జిగా, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో మహారాష్ట్రకు చెందిన ఏకైక నేత ఇతడేనన్నారు. కేంద్ర ప్రభుత్వ దృష్టిని కొండప్రాంతాల నుంచి ఎంఎంసీ జోన్ వైపు మళ్లించే బాధ్యతను కేంద్ర కమిటీ ఇతడికి అప్పగించిందని తెలిపారు.
అటవీప్రాంతాలతోపాటు అర్బన్ నక్సల్ ఉద్యమంతో దగ్గరి సంబంధాలున్న మావోయిస్ట్ నేతల్లో మిలింద్ తేల్‌తుమ్డే ఒకడని చెప్పారు. మిలింద్ తేల్‌తుమ్డే హక్కుల కార్యకర్త ఆనంద్ తేల్‌తుమ్డేకు సోదరుడు. ఎల్గార్ పరిషత్ మావోయిస్ట్ లింకుల కేసులో అరెస్టయిన ఆనంద్ ప్రస్తుతం తలోజా జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కోర్టుకు సమర్పించిన చార్జిషీటులో మిలింద్‌ను ప్రమాదకరమైన మావోయిస్ట్‌గా పేర్కొంది. మహారాష్ట్రలో 1996 నుంచి కొనసాగుతున్న మావోయిస్ట్ కార్యకలాపాల్లో ఇతనికి ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. ఇతడిపై గత ఐదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర భద్రతా విభాగాలు ఒక కన్నేసి ఉంచాయి. అజ్ఞాతంలో ఉన్న ఇతడు అనిల్, దీపక్, సహ్యాద్రి, కామ్రేడ్ ఎం.. వంటి పేర్లతో వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
బిహార్‌లో నక్సలైట్ల దాడిలో నలుగురి మృతి
గయ(బిహార్): బిహార్‌లో నక్సలైట్లు ఓ ఇంటిని బాంబులతో పేల్చివేయడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. గయ జిల్లా దుమారియా పోలీసు స్టేషన్ పరిధిలో బిహార్–జార్ఖండ్ సరిహద్దుకు సమీపంలో ఈ సంఘటన జరిగింది. మావోయిస్టులు శనివారం రాత్రి సర్యూసింగ్ భోక్తా ఇంట్లో బాంబు అమర్చి పేల్చేశారు. ఆ సమయంలో సర్యూసింగ్ ఇంట్లో లేరు. పేలుడుతో సర్యూసింగ్ ఇద్దరు కుమారులు, వారి భార్యలు మృతిచెందారు. మృతదేహాలను నక్సలైట్లు పశువుల దొడ్డిలో స్తంభానికి వేలాడదీశారు. ఘటనా స్థలంలో ఒక కరపత్రాన్ని వదిలి వెళ్లారు. సర్యూసింగ్, ఆయన కుటుంబం పోలీసు ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నందున వారిని శిక్షించామని అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment