గిడ్డి ఈశ్వరిని హెచ్చరించిన మావోయిస్టులు..! | Maoist Central Committee Letter To Media Over Bauxite mining | Sakshi
Sakshi News home page

‘గిడ్డి ఈశ్వరి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది’

Published Tue, Oct 9 2018 11:27 PM | Last Updated on Wed, Oct 10 2018 4:26 PM

Maoist Central Committee Letter To Media Over Bauxite mining - Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను విశాఖ జిల్లా డుంబ్రిగుడ సమీపంలోని లివిటిపుట్టు వద్ద గత నెల 23న దారుణంగా కాల్చిచంపిన మావోయిస్టులు ఆ హత్యాకాండపై బహిరంగలేఖ విడుదల చేశారు. గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయినందునే కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసినందునే సివేరి సోమలను హతమార్చినట్టు లేఖలో పేర్కొన్నారు. ప్రధాన పత్రికల సంపాదకుల పేరిట మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ మంగళవారం రాత్రి ఈ లేఖను విడుదల చేసింది. ‘‘గిరిజన వ్యతిరేకులు, ప్రజాద్రోహులైన కిడారి, సివేరి సోమలను సెప్టెంబర్‌ 23న ప్రజాకోర్టులో శిక్షించాం. గూడ క్వారీ విషయంలో ఎన్నోసార్లు హెచ్చరించినా అధికారపార్టీకి తొత్తులుగా మారి మా హెచ్చరికలను లెక్క చేయకపోవడమేగాక బాక్సైట్‌ తవ్వకాలకు లోలోపల ప్రభుత్వానికి సహకరించినందువల్లే శిక్షను అమలు చేశాం.

గిరిజనుల్ని మోసం చేసి స్వలాభం కోసం రూ.కోట్లకు అమ్ముడుపోయిన ప్రజాద్రోహి కిడారిని, అలాగే ఎన్నో తప్పులు చేసిన సివేరిలను కఠినంగా శిక్షించాం. ప్రజల సమక్షంలోనే వారు చేసిన తప్పులను ఒప్పుకున్నారు. అందుకే శిక్షలను అమలు చేశాం..’’ అని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. పోలీసునుద్దేశించి మావోయిస్టులు లేఖలో ప్రస్తావిస్తూ.. ‘‘ఆరోజు పోలీసు సోదరులు మాకు ఆయుధాలతో చిక్కినా వారిని చంపలేదు. పొట్టకూటికోసం ఉద్యోగం చేస్తున్నారని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాం. అదే మా విప్లవ సోదరులు మీకు దొరికితే దొంగకథలల్లి వాళ్లను నిస్సహాయులను చేసి ఎన్‌కౌంటర్‌ చేస్తారు కదా! మరి మీరు మా మాదిరి చేయగలరా? ఆలోచించండి..’’ అని కోరారు. 

మావోయిస్టులు విడుదల చేసిన బహిరంగ లేఖ 

రూ.20 కోట్లకు అమ్ముడుబోయిన గిడ్డి మాకు నీతులు చెప్పడమా? 
ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికారపార్టీకి తొత్తు అయిన గిడ్డి ఈశ్వరి తమను నిందించడమేంటని మావోయిస్టులు మండిపడ్డారు. రూ.20 కోట్లకు అధికారపార్టీకి అమ్ముడుపోయిన నువ్వు మాకు నీతులు చెప్పడమా? అని ధ్వజమెత్తారు. ‘ప్రజాకోర్టులో కిడారి నీ విషయంపై నిజం చెప్పాడు. నీకందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచి క్షమాపణలు చెప్పాలి. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించాలి. లేదంటే నీకూ కిడారి, సోమలకు పట్టిన గతే పడుతుంది. మేము చెప్పినట్లు చేస్తావు కదా! లేదంటే మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా.. ఆలోచించుకో’’ అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement