బహుజన్ సమాజ్ పార్టీలో చోటు చేసుకున్న అంతర్గత వివాదం బహిర్గతమయ్యింది. పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను రెండు కీలక పదవుల నుంచి తొలగించారు. గతంలో ఆమె ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, జాతీయ సమన్వయకర్తగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఆకాష్ విషయంలో ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆకాష్ ఆనంద్ బహిరంగ సభలలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించేటప్పుడు ఉపయోగించిన పదాలు మాయావతికి ఆగ్రహం తెప్పించాయి. ఇటీవల సీతాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆకాష్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బీజేపీ ప్రభుత్వాన్ని బుల్‌డోజర్ల ప్రభుత్వం అని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నాయని, అయితే ఇది బుల్డోజర్ల ప్రభుత్వం కాదని, ఉగ్రవాదుల ప్రభుత్వమంటూ ఆకాష్ ఆనంద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం దేశ ప్రజలను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వాన్ని టెర్రరిస్టుగా అభివర్ణించినందుకు సీతాపూర్‌లో ఆకాష్ ఆనంద్‌పై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనితోపాటు ఇటీవల ఆకాష్ ఆనంద్ ఒక సభలో బహుజన సమాజ్ నుండి ఓట్లు కోరుతున్న వారిని బూట్లతో కొట్టి తరమాలని వ్యాఖ్యానించారు. మరో ప్రకటనలో రామ మందిరాన్ని సందర్శించకూడదని తమ పార్టీ నిర్ణయించుకున్నదంటూ ప్రకటించారు. ఆకాష్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఈ పరిణామాల నేపధ్యంలో పార్టీ ఆయన ఎన్నికల ర్యాలీని రద్దు చేసింది.
బహిరంగ సభల్లో ప్రసంగించేటప్పుడు ఉపయోగించే భాషపై నియంత్రణ ఉండాలని ఆకాష్ ఆనంద్‌ను మాయావతి గత నెలలోనే హెచ్చరించారు. అయితే ఆయన దీనిని పట్టించుకోలేదు. ఈ దరిమిలా ఆకాష్ ఆనంద్ ప్రసంగాలపై మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె తన సోషల్ మీడియాలో ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు అందిస్తూ ‘పార్టీలో శ్రమిస్తున్నవారిని ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆకాష్ ఆనంద్‌ను తన వారసునిగా, నేషనల్ కోఆర్డినేటర్‌గా ప్రకటించాం. అయితే ఆయన పార్టీ చేపట్టిన ఉద్యమంలో పరిపక్వత సాధించే వరకు, అతనిని ఈ రెండు బాధ్యతల నుంచి తప్పిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు, పార్టీ ప్రయోజనాలతో పాటు ఉద్యమం కోసం బీఎస్‌పీ నాయకత్వం ఎటువంటి త్యాగానికైనా వెనకాడబోదని పార్టీ చీఫ్ మాయావతి పేర్కొన్నారు. బీఎస్‌పీ ఒక పార్టీ మాత్రమే కాదు.. అంబేద్కర్ ఆత్మగౌరవానికి ప్రతీక. సామాజిక మార్పు కోసం చేపడుతున్న ఉదమ్యమని మాయావతి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment