సాక్షి, అమరావతి, విశాఖపట్నం: తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు ముందుకొచ్చినప్పుడే ప్రభుత్వం చర్చలకు కూర్చుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో, ఆ తర్వాత విశాఖలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రుల కమిటీ నాలుగు రోజులుగా చర్చలకు ఆహ్వానిస్తున్నా ఉద్యోగ సంఘాల నాయకులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల కమిటీ రోజూ వచ్చి కూర్చోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. ప్రభుత్వ సానుకూల వైఖరిని అలుసుగా తీసుకోవద్దని హితవు పలికారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చినా తమకు వచ్చినట్లేనన్నారు. సుహృద్భావ వాతావరణంలో పరిష్కారాన్ని అన్వేషించాలన్నారు. ఉద్యోగుల పిలుపు కోసం ఎదురు చూస్తామని, ఎప్పుడొచ్చినా తలుపులు తెరిచే ఉంటాయన్నారు.
జీతాలు చూశాక మీరే చెప్పండి
ఉద్యోగులు, పెన్షనర్లు ప్రభుత్వంలో అంతర్భాగమని, మొండిగా వాదించకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. ఇంతకు ముందు కంటే ఈ పీఆర్సీలో రూ.16 వేల కోట్లు అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. ‘1వ తేదీన వచ్చే పే స్లిప్‌లో జీతం పెరుగుతుందో.. తగ్గుతుందో చూసుకోమంటే మాకు కొత్త జీతాలు వద్దంటున్నారు. ఆ జీతం తీసుకుని వాస్తవాలను ప్రజలకు చెప్పవచ్చు కదా? ఉద్యోగుల జీతాలు ఏ ఒక్కరికీ రూపాయి కూడా తగ్గవు. ఇతర సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కరించుకోవాలి. చరిత్రను చూస్తే చర్చలు విఫలమైన తర్వాతే యుద్ధాలు జరిగాయి. ఇక్కడ మనస్పర్థలు లేవు, భేషజాలు లేవు. మంచి వాతావరణం ఉంది. ఎందుకోసం ఇది జరుగుతుందో ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. చర్చల విషయంలో ఉద్యోగ సంఘాల ఆలోచనలు తమకు అర్థం కావట్లేదన్నారు. తాను గతంలో పదేళ్లు మంత్రిగా పని చేశానని, ఎన్నో ఉద్యోగ సంఘాల పోరాటాలు చూశానన్నారు. అప్పటి నాయకులు చర్చలు నిర్వహించాలని తనను కోరేవారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వమే చర్చలకు ఆహ్వానిస్తున్నా రాకపోవడం వెనుక రాజకీయ ఆలోచనలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
సంక్షేమ పథకాలను ప్రశ్నించడం సరికాదు
సంక్షేమ పథకాల అమలును ప్రశ్నించడం సరికాదని మంత్రి బొత్స అన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే వేతనాలతో పోలిస్తే సంక్షేమ పథకాలకు వెచ్చించేది చాలా తక్కున్నారు. ఇలాంటి లెక్కలతో ఘర్షణ వాతావరణానికి తెర తీసే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వెనక ఇతరుల ప్రమేయం ఉంటుందనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయని చెప్పారు. 5 కోట్ల మంది ప్రజలను మూడున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభావితం చేసేస్తారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ ఉద్యోగులు కోరుకుంటేనే ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు.
చదవండి: ‘ఆయన చేయలేనిది సీఎం జగన్ చేస్తున్నాడని బాబుకి కడుపు మంట’
Comments
Please login to add a commentAdd a comment