గుంటూరు రూరల్: రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని టీడీపీ నాయకులు రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో బాలిక వ్యభిచారం కేసులో నిందితులందరినీ అరెస్టు చేసిన వారం తర్వాత టీడీపీ మహిళా నాయకులు రాద్ధాంతం చేయటం ఏమిటని ప్రశ్నించారు. సున్నితమైన ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం బాధాకరమన్నారు.
ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం 43 మందిని అరెస్టు చేసినట్లు మంత్రి వెల్లడించారు. బాధితురాలు ఆరోపించిన వారితో పాటు సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు మంత్రి చెప్పారు. ఈ కేసు విషయంలో తమ పార్టీకి సంబంధించిన వ్యక్తిపైనా ఆరోపణలు వచ్చినప్పటికీ నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నామన్నారు. తెలంగాణకు చెందిన ఆరుగురి ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో వారినీ అరెస్టు చేసినట్లు సుచరిత తెలిపారు. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల విషయంలో సీఎం జగన్ ఎక్కడా రాజీపడకుండా పనిచేస్తుంటే టీడీపీ నేతలు రచ్చచేయడం మంచి పద్ధతి కాదన్నారు.
మానవతా దృక్పథంతో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడాన్ని కూడా తప్పుబట్టడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీడీపీ హయాంలో మహిళలపై జరిగిన నేరాల విషయంలో చంద్రబాబు ఏ విధంగా స్పందించారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. చంద్రబాబునాయుడే స్వయంగా దళితుల గురించి, ఆడబిడ్డల పుట్టుక గురించి నీచంగా మాట్లాడి ఇప్పటివరకు కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని సుచరిత గుర్తుచేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు సున్నితమైన మహిళల విషయాలను రాజకీయం చేయడం మానుకుని మహిళల పట్ల గౌరవంగా ఉండాలని, స్వార్థ రాజకీయాల కోసం వారి జీవితాలను రోడ్ల మీదకు లాగడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు.
రాజకీయ లబ్ధికే టీడీపీ రాద్ధాంతాలు
Published Sun, Jan 30 2022 2:45 AM | Last Updated on Sun, Jan 30 2022 5:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment