సాక్షి, పల్నాడు జిల్లా: జిత్తులమారి పార్టీలు మోసాలు, కుట్రలు చేస్తున్నాయంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా 12వ రోజు బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మనం సిద్దం సిద్ధం.. అంటే.. వారికి యుద్ధంగా ప్రతిధ్వనిస్తోందన్నారు.
చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు
‘‘ఈ ఎన్నికలు జగన్‌కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్‌కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబు అంటే ఎన్నికల ముందు గంగా.. అధికారం దక్కిన తర్వాత చంద్రముఖి. చంద్రబాబుకు ఓటేస్తే పేదవాళ్లు మోసపోతారు. ఇవి పేదల తలరాతను మార్చే ఎన్నికలు. మేం ఎప్పుడూ పేదల పక్షమే. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగన్‌కు ఓటేయాలి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి.. పచ్చమీడియా గాడిదను తీసుకొచ్చి గుర్రం అని ప్రచారం చేస్తాయి’’ అని సీఎం జగన్ మండిపడ్డారు.
జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?
‘‘చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారా?. చంద్రబాబు హయాంలో ఒకరికైనా మంచి జరిగిందా?. జాబు రావాలంటే ఎవరు కావాలి?. జాబు రావాలంటే ఫ్యాను రావాలా.. లేక తుప్పు పట్టిన సైకిల్ రావాలా?. అధికారంలోకి రాగానే 2 లక్షల 31 ఉద్యోగాలు భర్తీ చేశాం. పేదలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో రైతుకు ఏమీ చేయని చంద్రబాబు.. ఇప్పుడు మేలు చేస్తాడట. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. జగన్‌ది ప్రొగ్రెస్ రిపోర్ట్. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబే. ‘కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న వ్యక్తి చంద్రబాబు’’ అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.
రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు
‘‘రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. పగటిపూట 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నాడు.. విడిపించాడా?
రైతులకు సున్నా వడ్డీ, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఎగ్గొట్టేశాడు.. మనం వచ్చాక రైతన్నకు తోడుగా ఉన్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతున్నకు తోడుగా ఉన్నాం. రైతన్నకు చంద్రబాబు చేసిందేమీ లేదు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘ప్రతి ఏడాది రైతు భరోసా ద్వారా రూ. 13,500 ఇచ్చాం. పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పాం రూ.64 వేల కోట్లతో ధాన్యం సేకరణ చేపట్టాం. ఏ సీజన్‌లోని ఇన్‌ఫుట్ సబ్సిడీని ఆ సీజన్‌లోనే ఇస్తున్నాం. సున్నా వడ్డీకే రుణాలిచ్చాం. 35 లక్షల ఎకరాలకు శాశ్వత భూ హక్కులు కల్పించాం’’ అని సీఎం జగన్ వివరించారు.
ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది
‘‘వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని చంద్రబాబు అంటున్నాడు. ఇలాగైనా జగన్ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు. ఇన్నాళ్లూ వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు విషం చిమ్మారు. ఇప్పుడు వాలంటీర్లకు రూ. 10వేలు ఇస్తామంటున్నారు.. ఇంతకంటే జగన్ పాలనకు మీరిచ్చే సర్టిఫికెట్ ఏం ఉంటుంది. తిరగబడే సరికి చంద్రబాబు మారిపోయాడు. ఇప్పుడు వాలంటీర్లను మెచ్చుకుంటున్నారు. మంచి చేశాం కాబట్టే ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment