సాక్షిప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి/కరీంనగర్ టౌన్: కరీంనగర్‌లో తన గెలుపు ఖాయమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంచుతూ కుట్రలకు తెరలేపి, దిగజారిపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ‘కేసీఆర్.. సీఎంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిగ్గు లేదా?’అంటూ ధ్వజమెత్తారు. మీరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్‌లో బండి సంజయ్ గెలవబోతున్నాడని, డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని చెప్పారు.
కరీంనగర్‌లోని కొత్తపల్లిలో బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లిన బండి సంజయ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. డబ్బుల పంపిణీపై తమ కార్యకర్తలు సమాచారం అందించారని చెప్పారు. గంగుల కమలాకర్ కొంతమంది మహిళా గ్రూపులు, మరి కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఓటుకు రూ.10 వేలు చొప్పున పంచి పెడుతున్నారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వెళ్లిన తమ కార్యకర్తలపై బీఆర్‌ఎస్ నేతలు నిస్సిగ్గుగా దాడులకు యత్నించారని అన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నా, కొందరు కింది స్థాయి సిబ్బంది గంగులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంజయ్ సహా బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి చేరుకోవడం, బీఆర్‌ఎస్ నేతలు కొందరు గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించడం, రెండు వర్గాల నినాదాలతో పట్టణంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, బీఆర్‌ఎస్ నాయకులు డబ్బులు పంచుతుంటే ఏం చేస్తున్నారంటూ సంజయ్ వారిని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment