
తాడేపల్లి: ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు.. అందుకే మహానాడు ఆత్మస్తుతి.. పరనిందలా సాగింది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రెండేళ్లుగా చంద్రబాబు, ముఖ్యమంత్రిపై విమర్శలకే పరిమితం అయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో బాబు "బ్రీఫ్డ్ మీ" వ్యాఖ్యలను ప్రపంచం మొత్తం చూసింది.. ఫోరెన్సిక్ ఈ వ్యాఖ్యలను నిజమని తేల్చిందన్నారు బొత్స. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట.. కానీ ప్రజలను మేనేజ్ చేయలేరు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలి. చంద్రబాబు నైజం దోచుకోవడం.. దాచుకోవడమే. మహానాడు ద్వారా చంద్రబాబు ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు యత్నించారు’’ అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఒక కమిట్‌మెంట్‌తో, ఆలోచనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి క్షణం సీఎం జగన్ శ్రమిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను 99 శాతం నేరవేర్చాం. సంక్షేమ పథకాల ద్వారా లక్షా 20 వేల కోట్లను నేరుగా ప్రజలకే అందించాం. ప్రతి అంశాన్నిr రాజకీయం చేయాలనే చంద్రబాబు యత్నం. ఆయన జూమ్ కార్యక్రమాలను చూస్తుంటే నవ్వొస్తుంది’’ అంటూ బొత్స ఎద్దేవా చేశారు.
‘‘చంద్రబాబు హయాంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ను కాంట్రాక్ట్‌లకు కట్టబెట్టి పూర్తిగా దోచుకున్నారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం పూర్తి కాలేదు. చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ప్రజలు తిరస్కరించారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే మేం చట్టాలు చేస్తున్నాం. ప్రతి చట్టంలోనూ సామాన్యుడికే మేలు జరిగేటట్లు చూశాం. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. రెండేళ్ల సీఎం జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. మున్ముందు ఇంకా సంక్షేమ పాలన సాగుతుంది’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment