సాక్షి, కోనసీమ: ద్వారంపూడిపై పోటీచేసి గెలిచే దమ్ము పవన్ కల్యాణ్‌కు ఉందా అని బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. గోదావరి జిల్లాల్లో కుల చిచ్చు రగులుస్తున్న పవన్‌కు ఒక సొంత విధానం, ఆలోచనలే లేవని ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ ఆరాటమని విమర్శించారు. కాపు, శెట్టిబలిజల ఐక్యతపై పవన్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు.
కులం లేదంటూనే.. 75సార్లు కులప్రస్తావనెందుకు తీశారని మంత్రి పవన్‌ను నిలదీశారు. మహిళల భద్రత, సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హతే లేదని అన్నారు. ప్రాణహాని అంటూ సానుభూతి కబుర్లను జనం నమ్మరని పేర్కొన్నారు. ఈ మేరకు రామచంద్రాపురం క్యాంపు కార్యాలయంలో చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో
‘పవన్ సినిమాల్లో హీరో.. రాజకీయాల్లో జీరో. ప్రజాజీవితంలో ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు చరిత్రలో నిలబడతారు. ఈ మేరకు వారు ప్రజల సేవలో తరిస్తూ ముందుకెళ్తుంటారు. మరోవైపు ప్రజామోదం లభించకపోవడంతో తీవ్రమైన ఫ్రస్టేషన్‌కు గురై ప్రగల్భాల ద్వారా ప్రజల్లో ఆకర్షణ పొందుతామని తాపత్రయం పడేవారు మరికొందరుంటారు. వీరిలో రెండోవర్గానికి చెందిన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అని చెప్పుకోవచ్చు. నిన్న కాకినాడలో పవన్‌అనేక ప్రగల్భాలు పలికాడు. నిజ జీవితాన్నే ఆయన సినిమా అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలు తగినట్లు ప్రభుత్వాన్ని నడిపిస్తూ చరిత్రలో ముందెన్నడూ లేని పాలనను చూపిస్తున్నారని’ కొనియాడారు.
ప్రగల్భాలకే ప్రాధాన్యమిచ్చే పవన్‌ను నమ్మేదెవరు..?
పార్టీని పదేళ్లుగా పోషిస్తున్నానంటూ పదేపదే పవన్‌కళ్యాణ్ చెబుతున్నాడు కదా.. నిజానికి, ఆ పార్టీని ఇన్నాళ్లూ పోషించిన వారంతా నాశనమయ్యారు. ఆ పార్టీలో ఇన్నాళ్లూ మొదటి శ్రేణిలో పనిచేసిన వారంతా కూడా ఈరోజు పార్టీని వదిలిపెట్టి వెళ్లారు. ఇందుకు కారణం కేవలం పవన్‌కళ్యాణ్ ప్రవర్తన మాత్రమే. ఈ విషయంపై ఆత్మపరిశీలన చేసుకుని ఆయన ఎప్పుడైనా ఆలోచించారా..? అని అడుగుతున్నాను. నిన్ను నమ్మి రాజకీయ ప్రయాణంలో గమ్యానికి చేరాలని వచ్చిన సీనియర్ మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పారిశ్రామికవేత్తలు వచ్చి పార్టీలో చేరి పనిచేస్తే.. నీ మీద నమ్మకం లేక, నీ ప్రవర్తన నచ్చకపోవడంతోనే కదా..వారంతా పార్టీని విడిచి వెళ్లింది’ అని ప్రశ్నించారు.
‘ద్వారంపూడి’ ఫోబియాతో పవన్‌యాత్ర
నాడు గెలవలేని మీరు.. రేపు ఓడిస్తారా..? 2019 ఎన్నికల్లో ప్రజామోదం ద్వారా గెలవలేని పవన్‌కళ్యాణ్ 2024లో వైఎస్‌ఆర్‌సీపీని ఓడిస్తారా..? ఇదెంత హాస్యాస్పదమైన మాట. గడచిన నాలుగు రోజులుగా మీ వారాహీ యాత్రను చూసినట్లయితే, మా పార్టీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఫోబియాతోనే నడుస్తున్నట్లు అర్థమౌతుంది. మొన్న అన్నవరం నుంచి యాత్ర మొదలుపెట్టినదగ్గర్నుంచి రోజూ పవన్‌కళ్యాణ్ మాత్రం ద్వారంపూడి చంద్రశేఖర్ ఫోబియా పట్టుకుని పదేపదే అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన ఆరోపణలన్నీ పసలేనివని అక్కడ ప్రజలే చెబుతున్నారు. ఎవడో చెప్పినవి, రాసిచ్చిన స్క్రిఫ్టును పట్టుకుని పవన్ వీరావేశం పడటంలో అర్ధమేముంటుంది..? ఆయన పిచ్చి మాటలకు కాకినాడ ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యంగాస్త్రాలు’ సంధించారు.
ద్వారంపూడి సవాల్‌ను స్వీకరించే దమ్ముందా..?
తనపై పవన్‌కళ్యాణ్ చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని ద్వారంపూడి చంద్రశేఖర్ గారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు మీకు బహిరంగ సవాల్ విసురుతున్నాడు. తనపై చేసిన ఆరోపణల్ని ఆధారాలతో సహా రుజువు చేయాలని.. లేదంటే, కాకినాడలో నాపై పోటీచేస్తానని కాకినాడ యాత్ర ముగించేలోపు చెప్పాలంటూ సవాల్ విసిరాడు కదా.. మరి, మా నాయకుడు సవాల్‌ను స్వీకరిస్తారా పవన్‌కళ్యాణ్..? జనసేన పార్టీ అధినేతగా మీకు మీరే నిర్ణయం తీసుకున్నా సరే..లేదంటే, చంద్రబాబును అడిగి చెబుతానని చెప్పినా సరిపోతుంది. ఖచ్చితంగా మా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి సవాల్‌ను స్వీకరించి ఆయనపై పోటీచేస్తే పవన్‌కళ్యాణ్‌కు ఒక విలువ, గౌరవం ఉంటుందని హితవు’ పలికారు.
ప్రాణహాని ఉందంటూ సానుభూతి కబుర్లు ఆపాలి
2018లో పవన్‌కళ్యాణ్ తనకు ప్రాణహాని ఉందని ఆరోజు తన మిత్రుడు అధికారంలో ఉండగా అడిగాడు. అప్పట్లో పోలీసుల్ని కూడా తాను నమ్మనన్నాడు. మరి, ఈరోజు వారాహీ యాత్ర గత నాలుగురోజులుగా పూర్తి స్వేచ్ఛగా పోలీసు సెక్యూరిటీతో.. వారంతా మేకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు గదా..? అలాంటిది, మళ్లీ ఇప్పుడు నాకు ప్రాణహాని ఉందని పదేపదే ఎందుకు చెబుతున్నాడు..? నిజానికి, ప్రజలకోసం పనిచేసే నాయకుడు తన సొంత ప్రాణాన్ని కూడా పణంగా పెడతానని అనడం పరిపాటి. ఏ నాయకుడైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే తన ప్రాణాల్ని సైతం లెక్కచేయనని చెప్పుకోవడం’ మంచిదన్నారు.
దేశానికే దిక్సూచీగా ఉన్న జగన్ విమర్శిస్తారా..?
బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రాం వంటి ఆదర్శనీయుల స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ రాష్ట్రంలోని సకలవర్గాల్ని అక్కునజేర్చుకుని సుభిక్షమైన పరిపాలనను అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాల పంపిణీలో టీడీపీ శ్రేణులతో సహా శెభాష్ అనిపించుకుంటూ సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే కేంద్రాలతో దేశానికే దిక్సూచీగా జగన్‌గారు ఆదరణ పొందుతున్నారు. అలాంటి ముఖ్యమంత్రిని పట్టుకుని పవన్‌కళ్యాణ్ ఇష్టానుసారంగా దూషిస్తాడా..? ఆయనకున్న అర్హతేంటి..? చంద్రబాబును అధికారంలోకి తేవాలనే లక్ష్యంతోనే జనసేన పార్టీని పెట్టడం, ఆయన భజన చేసుకుంటూ.. వైఎస్‌ఆర్‌సీపీని విమర్శిస్తూ ప్రజల ముందు ప్రగల్భాలు పలుకుతూ తిరుగుతున్నాడు పవన్‌కళ్యాణ్. సినిమాల్లో ఆయనెంత హీరోనైనా.. రాజకీయాల్లో మాత్రం ఆయనొక స్థిరత్వంలేని దిగజారుడు మనస్తత్వంతో ముందుకుపోతున్నారని అన్నారు.
175 స్థానాల్ని వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయం..
‘చంద్రబాబు చెప్పాడని.. ఈయనొచ్చి ఆయన కోసం మా నాయకుడ్ని తిడతాడా..? కులరాజకీయాలేమీ ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగడంలేదు. అలాంటి రాజకీయాలకు మా జగన్ గారు పూర్తిగా వ్యతిరేకం. పవన్‌కళ్యాణ్ చేస్తున్న కులరాజకీయ ఆరోపణల్ని పసలేనివని చెబుతూ నేను ఖండిస్తున్నాను. టీడీపీ నేతలు, చంద్రబాబు మాదిరిగా మా పార్టీకి ఓటేస్తేనే ప్రభుత్వ పథకాలిస్తామనేది మా విధానం కాదు. మాకున్న ఏకైక సిద్ధాంతమల్లా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతంతో పాటు రాజకీయ పార్టీ కూడా చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమం అందించాలనే లక్ష్యంతో మా నాయకుడు జగన్‌గారి ఆదేశాల్ని పాటిస్తున్నాం. బాబు 2012 నుంచి జగన్ గారి వ్యక్తిగత ప్రతిష్టతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్నుంచి బాబు చేసిన ఆరోపణలన్నింటినీ ప్రజలు నమ్మలేదుకదా..? ఆయన చేసిన విమర్శల కారణంగానే మాకు 2019లో 151 సీట్లు వచ్చాయి. ఇప్పుడు పవన్‌కళ్యాణ్ చేసే విమర్శలతో 2024లో 175 స్థానాలకు 175 స్థానాల్ని కైవసం చేసుకోబోతున్నామని ధీమాగా చెబుతున్నాను’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment