అబద్ధాలతో ఏమార్చడమే చంద్రబాబు అజెండా | Minister Chelluboina Venu Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో ఏమార్చడమే చంద్రబాబు అజెండా

Published Mon, Aug 3 2020 1:03 PM | Last Updated on Mon, Aug 3 2020 1:03 PM

Minister Chelluboina Venu Slams Chandrababu Naidu - Sakshi

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి చెల్లుబోయిన వేణు

కాకినాడ: కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలతో ప్రజలను ఏమార్చడమే మాజీ సీఎం చంద్రబాబు అండ్‌ కో ప్రధాన అజెండా అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తన బినామీల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, వారి ప్రయోజనాలను కాపాడుకునేందుకే అమరావతి పేరుతో చంద్రబాబు కృత్రిమ ఉద్యమాలు చేస్తూ ఇంతకాలం పబ్బం గడుపుకొన్నారని ఎద్దేవా చేశారు. కాకినాడలోని డి కన్వెన్షన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వేణు మాట్లాడారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని ట్వీట్లతో కాలక్షేపం చేస్తూ, పెయిడ్‌ ఆర్టిస్టులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. విభజన సమయంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి నోరు మెదపని చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని తరలిస్తున్నారంటూ ఉద్యమాలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్ర ప్రయోజనాలనుతాకట్టు పెట్టిన చంద్రబాబు..

ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలంటూ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. అమరావతి ఉంటూనే మరో రెండు కొత్త రాజధానులు ఏర్పాటవుతున్న వాస్తవాన్ని పక్కన పెట్టి, అమరావతిని తరలించేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని వేణు మండిపడ్డారు. తన హయాంలో శివరామకృష్ణన్‌ కమిటీ ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టి, రైతులను నిలువునా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి 30 వేల ఎకరాలు సేకరించిన చంద్రబాబు అక్కడ ఎన్ని ప్లాట్‌లు నిర్మించారు, ఎన్ని మౌలిక వసతులు కల్పించారో చెప్పాలని ప్రశ్నించారు. 51 శాతం ఓట్లతో అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మూడు రాజధానుల ద్వారా అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తుంటే చంద్రబాబుకు కడుపు మంటగా ఉందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, కర్నూలు న్యాయరాజధానిగా ఏర్పడితే చంద్రబాబుకు బాధ ఏమిటని ప్రశ్నించారు. ప్రజాధన భక్షకులుగా ఉన్న నాటి టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పారని, ఆ అక్కసుతో ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు సైతం చంద్రబాబు వెనుకాడడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోకపోతే రాజకీయంగా మరింత పతనం కావడం తథ్యమని అన్నారు. సీఆర్‌డీఏ రద్దు, అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలియజేయడం రాష్ట్ర ప్రగతికి శుభపరిణామమని వేణు వ్యాఖ్యానించారు.

బీసీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం
ప్రభుత్వ పథకాల ద్వారా వెనుకబడిన వర్గాలు పూర్తిస్థాయిలో ఆర్థిక పరిపుష్టి సాధించడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేస్తున్నామని మంత్రి వేణు చెప్పారు. ప్రభుత్వ పథకాలు సబ్సిడీలకే పరిమితం కాకుండా, వాటి ద్వారా ఆయా వర్గాల ఆర్థిక భద్రత, ఆత్మగౌరవం పెంచడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అరకొర నిధులు కేటాయించగా.. తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.26 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ లబ్ధిదారుల ప్రయోజనాలను కాపాడేలా చూసేందుకు అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాం బీసీలకు స్వర్ణయుగమని అన్నారు. 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏటా రూ.18 వేలు ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. అర్హతే ప్రాతిపదికగా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు.

పారదర్శకంగా పథకాలు
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అవినీతిమయం చేస్తే.. తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హతే ప్రాతిపదికన వ్యవస్థల్లో సమూల మార్పులు తీసుకు వచ్చిందని వేణు అన్నారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయినా అర్హత ఉంటే నేరుగా లబ్ధి అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ వంటి విప్లవాత్మక నిర్ణయాల ద్వారా ప్రభుత్వ పరిపాలనను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లిన ఘనత జగన్‌ సర్కారుదేనని చెప్పారు. న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలకు టీడీపీ అడుగడుగునా అవరోధం కల్పిస్తోందన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, కొంత జాప్యం జరిగినా అంతిమ విజయం సాధించి, అనుకున్న లక్ష్యం మేరకు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు.

కరోనా నియంత్రణలో ఏపీ ఆదర్శం 
కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వేణు అన్నారు. కోవిడ్‌–19 తీవ్రతను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా పరీక్షల పెంపు, సంజీవిని వాహనాల ఏర్పాటు, అత్యంత వేగంగా కోవిడ్‌ రోగులకు పడకల ఏర్పాటు వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. వీటిని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయన్నారు. ఇలాంటి విపత్కర సమయాల్లో విమర్శలు పక్కన పెట్టి, సమస్యలను అధిగమించే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. తనను అక్కున చేర్చుకుని ఆదరించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలకునిగా కాకుండా సేవకునిగా సేవలందిస్తానని వేణు చెప్పారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి గుబ్బల తులసీకుమార్‌ కూడా పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement