సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పరీక్ష పేపర్లు లీకు చేసిన దొంగలను అరెస్టు చేసి జైలులో పెట్టాక ఇప్పుడు పరీక్షలన్నీ సజావుగా సాగుతున్నాయని రాష్ట్ర వైద్యా రోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ నేతలు ఎన్నో కుట్రలు చేస్తున్నారని, హిందూ, ముస్లింల మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరో పించారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసి విఫలమయ్యారన్నారు. సీఎం కేసీఆర్ బలమైన తెలంగాణ నిర్మాణానికి పునాదులు వేస్తుంటే బీజేపీ నేతలు సమాధులు తవ్వుతామంటున్నారని ధ్వజమెత్తారు.
ఒక్క మెడికల్ కాలేజీకి ఇంత ప్రచారమా..
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనపైనా హరీశ్ విమర్శ లు గుప్పించారు. నాలుగేళ్ల క్రితం మంజూరైన ఒక్క మెడికల్ కాలేజీ ఎయిమ్స్‌కు మోదీ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం గత ఏడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలు ప్రారంభించిందని గుర్తు చేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మందికి కంటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు.
కాంగ్రెస్ రోజురోజుకూ బలహీనపడుతోంది
కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ బలహీనపడుతోందని హరీశ్‌రావు అన్నారు. సోనియాని విమర్శిస్తే కనీసం ఖండించలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. లోక్‌సభ నుంచి రాహుల్‌గాం«దీని తీసిపారేస్తే దిక్కు దివాణం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అలాంటి కాంగ్రెస్ పార్టీని నమ్మితే నష్టపోతారన్నారు.
సెక్రటేరియట్‌ను కూలగొడతానని, ప్రగతిభవన్‌కు కాలబెడతానని అంటున్న రేవంత్‌రెడ్డి లాంటి నేతలు కావాలా? తెలంగాణను నిర్మించే కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, జెడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ
వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment