సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారత సైన్యాన్ని ప్రైవేటీకరించే దిశగానే మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ ప్రవేశపెడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా భీంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జై జవాన్, జై కిసాన్ బదులు నై జవాన్, నై కిసాన్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అందుకే సైన్యంలో సర్వీసు నాలుగేళ్లే అంటున్నారన్నారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్న మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎల్‌ఐసీ, విశాఖ ఉక్కును అమ్మేసిందని మండిపడ్డారు. అగ్నిపథ్ రద్దు చేయాలంటూ యువత చేసిన ఆందోళన వెనుక టీఆర్‌ఎస్ ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారని, అలా అయితే ఉత్తరప్రదేశ్, బిహార్‌లో ఎవరు ఆందోళన చేయించారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతిఆయోగ్ సిఫారసులను కూడా వినడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు చేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందని హరీశ్ తెలిపారు. సభలో రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment