సాక్షి, హైదరాబాద్: ‘కొందరు శత్రువులు నాకు కూడా ఈటల రాజేందర్ గతి పడుతుందని కలలు కంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏదో చేస్తామని అనుకుంటున్నారు. అది కలలో కూడా జరగదు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎదురు చూస్తు న్న ఓ పార్టీ గందరగోళం సృష్టించాలని అనుకుంటోంది’అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘టీఆర్‌ఎస్‌ను వీడిన వారే నష్టపోతారు, గుంపును వదిలి అడవికి వెళ్తే సింహాల పాలవుతారు’ అని ఈటలనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యేంత వరకు ఈటల టీఆర్‌ఎస్‌లోనే ఉండాల్సిందని, ఆయన వెళ్లడం ద్వారా పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. పార్టీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, మల్లయ్య యాదవ్, పైలా శేఖర్‌రెడ్డి, భాస్కర్‌రావుతో కలసి సోమవారం మంత్రి టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదమని, ఆయన హిట్లర్ వారసుల సరసన చేరారని విమర్శించారు. బీజేపీలో చేరికపై ఈటల అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని, ఆయనకు ప్రత్యేక ఎజెండా ఏదో ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఈటలకు ఇబ్బందులు లేవని, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమయ్యేవని వ్యాఖ్యానించారు. మునిగిపోయే పడవలాంటి బీజేపీలో ఈటల చేరారని, ఆయనతో పాటు చేరే వారు కూడా మునిగి పోతారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆకలిచావులు, ఆత్మహత్యలు లేవన్నారు. కోటి టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం పంజాబ్‌ను దాటి పోయిందని, కేసీఆర్ పాలనాదక్షత వల్లే అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసమే భూముల అమ్మకం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment