సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(kishan Reddy) తీవ్రంగా ఖండించారు. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బీజేపీ(Telangana BJP Office) రాష్ట్ర కార్యాలయంపై దాడి నేపథ్యంలో కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..‘తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పిరికిపిందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడటం దుర్మార్గం.
రాళ్లు, కర్రలతో కాంగ్రెస్ గూండాలు పోలీసుల సమక్షంలో, పోలీసులతో కలిసి వచ్చి ఆఫీసుపైన, బీజేపీ కార్యకర్తలపైన దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు, భౌతిక దాడులకు తావు లేదు. ఇలాంటి రాజకీయాలకు మేం పూర్తి వ్యతిరేకం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి కక్షపూరిత, ద్వేషపూరిత రాజకీయాలు రాష్ట్రంలో పెరిగిపోయాయి. గతంలో సొంతపార్టీకి చెందిన ముఖ్యమంత్రులను గద్దెదించేందుకు మతకల్లోలాలు సృష్టించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసమర్థ పాలనతో ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న తరుణంలో.. అసహనంతో ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి దాడులను ఆపకపోతే.. ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాను. పోలీసుల సమక్షంలో బీజేపీ కార్యాలయంపై దాడిచేసి.. మా కార్యకర్తలను గాయపరిచిన విషయం ముఖ్యమంత్రికి తెలియకుండా జరగదు. ఖబడ్దార్, అసహనం కోల్పోయి మీరు చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు తిరగబడితే.. దేశంలో కాంగ్రెస్‌కు ఉన్న కొద్దిపాటి నాయకులు తిరగలేని పరిస్థితులు ఏర్పడతాయి.
రాష్ట్రంలో ఈ రకమైన దాడులతో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మా సహనాన్ని అసమర్థతగా భావించవద్దు. మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించం. అలాగని మాపై దాడులు చేస్తే సహించం. ఎవరి వ్యాఖ్యలైనా మీకు నచ్చకపోతే.. నిరసన తెలియజేయండి అంతే కానీ.. కార్యాలయంపై భౌతికంగా దాడి చేయడం, రాళ్లు, కర్రలతో దాడికి దిగడం సరికాదు. తన వ్యాఖ్యలకు ఢిల్లీకి చెందిన మాజీ ఎంపీ రమేశ్ బిదూరీ గారు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా.. అసహనంతో దాడులు చేయడం సరైనదేనా?.
గతంలోనూ ప్రధానమంత్రికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖండిస్తూ బీజేపీ ఎక్కడైనా దాడులు చేసిందా?. ఈ వ్యాఖ్యలకు ఒక్కసారి కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒక్కసారైనా క్షమాపణలు చెప్పారా?. అలాంటి సంస్కారం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేం దీనికి ప్రతిగా సమాధానం చెబితే.. ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు దేశంలో రోడ్లపై తిరగలేడు. కానీ ఇది మా సంస్కృతి కాదు. మీ సంస్కృతిని మార్చుకోండి అంటూ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: రాళ్లు, కర్రలతో దాడి.. బీజేపీ ఆఫీసు వద్ద ఉదద్రిక్తత..
Comments
Please login to add a commentAdd a comment