సాక్షి, అమరావతి: ఫ్రీ ఇసుక పేరుతో చంద్రబాబు దోచుకున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డ్వాక్రా మహిళల పేరుతో చంద్రబాబు ఇసుక రీచ్‌ల్లో దోచుకున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబులా దిక్కుమాలిన కర్మ మాకు పట్టలేదు. రెండెకరాల నుంచి వేల కోట్ల సంపాదనకు చంద్రబాబు ఎలాంటి అక్రమాలు చేశారో అందరికీ తెలుసు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని కొడాలి నాని నిప్పులు చెరిగారు. (చదవండి: నిమ్మగడ్డ ఓ అజ్ఞాతవాసి: కొడాలి నాని)
నిమ్మగడ్డ రమేష్.. చంద్రబాబు ఏజెంట్ అని మంత్రి దుయ్యబట్టారు. ఎస్‌ఈసీ.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే నడుస్తున్నారని విమర్శించారు. ‘‘రాజ్యాంగ వ్యవస్థపై మాకు గౌరవం ఉంది. ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎవరిని సంప్రదించారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన బాధ్యత నిమ్మగడ్డపై లేదా?. చంద్రబాబు చెబితే ఎన్నికలు వాయిదా వేస్తారా?. చంద్రబాబు తన స్వార్థం కోసం నిమ్మగడ్డను ఎస్‌ఈసీగా నియమించారు. ఇప్పుడు చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పనిచేస్తున్నారంటూ’’ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (చదవండి: ‘అప్పుడాయన ఎక్కడున్నారు..?’)
బురద చల్లడం సరికాదు: మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు ఇసుక దోపిడీపై ఎన్జీటీ భారీ జరిమానా విధించిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీలో కొన్ని సవరించామని పేర్కొన్నారు. సబ్‌కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇసుక పాలసీని కేబినెట్ ఆమోదించిందని, ఎన్‌ఎండీసీ, ఎమ్‌ఎస్‌డీసీ కంపెనీలు ఇసుక సరఫరాకు ముందుకొచ్చాయని ఆయన పేర్కొన్నారు. ‘‘కేంద్ర సంస్థల ఆధ్వర్యంలోనే ఇసుక పంపిణీ జరుగుతుంది. చంద్రబాబు హైదరాబాద్‌లో జూమ్‌లో కూర్చుని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఎల్లో మీడియా ద్వారా తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు ఆరోపణలను ఖండిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం:నారాయణ స్వామి
తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిపై సీఎం వైఎస్ జగన్ అభిప్రాయాలు తీసుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లా నేతలతో సీఎం జగన్ సమావేశమయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నామని నారాయణ స్వామిపేర్కొన్నారు.
అంతా ఏకాభిప్రాయమే: కాకాని గోవర్థన్‌రెడ్డి
తిరుపతి అభ్యర్థి ఎవరైనా మేము కట్టుబడి ఉంటామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిపై గతంలో వచ్చిన మెజారిటీ కంటే అత్యధికంగా సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భిన్నాభిప్రాయాలు ఏమీ లేవని, అంతా ఏకాభిప్రాయం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment