హైదరాబాద్: ఏపీ స్కిల్ స్కామ్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో తెలంగాణలో పలు ర్యాలీలు ఏర్పాటు చేసి సానుభూతి పొందాలని టీడీపీ ప్లాన్ చేసింది. ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగులతో ర్యాలీ నిర్వహించాలని చూశారు. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఇదే విషయాన్ని నారా లోకేష్.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారట.
తాజాగా దీనికి సంబంధించి మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో ర్యాలీకి అనుమతి ఎందుకు ఇవ్వలేదని లోకేష్ తనకు ఫోన్ చేసి అడిగినట్లు పేర్కొన్నారు. ఇది ఏపీలోని రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశమైతే ఇక్కడ ర్యాలీలు చేయడం ఏంటని ప్రశ్నించినట్లు తెలిపారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకు.. ఏపీలో చేసుకోండి అని కేటీఆర్ నిలదీశారు.
‘లోకేష్ ఫోన్ చేసి చేసి ర్యాలీలకు అనుమతి ఎందుకు ఇవ్వలేదని అడిగాడు. ఇది రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం. హైదరాబాద్‌లో ఐటీ డిస్టర్బ్ కావడానికి వీల్లేదు. తెలంగాణలో వద్దు.. ఏపీలో చేసుకోమన్నా. చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంశం. చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ధర్నాలు, ర్యాలీలేంటీ?. ఇక్కడి ఉద్యోగులకు చెబుతున్నా.. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దు. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయొద్దని చెబుతున్నాను. ఇక్కడి ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరియర్ పాడు చేసుకోవద్దు. తెలంగాణకు ఏపీ రాజకీయాలు తెచ్చి అంటించొద్దు. ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వాలని లోకేష్ అడిగారు. రాజకీయాల కంటే శాంతిభద్రతలే మాకు ముఖ్యమని చెప్పాం. ఏపీ రాజకీయాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.?’ అని కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment