సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ పేల్చేయాలని రేవంత్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. ప్రగతి భవన్ పేల్చేయండని అనొచ్చా? ఇదేనా కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం అంటూ విమర్మలు గుప్పించారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ మంచి వాళ్లే. సావాస దోషం వల్ల ఇద్దరూ అసెంబ్లీలో అస్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడేమో ధరణి రద్దు చేస్తా అని ప్రకటనలు చేస్తాడు. మా అధ్యక్షుడు అలా మాట్లాడలేదని శ్రీధర్ బాబు చెబుతున్నాడు. కాంగ్రెస్ నాయకుల నోట్లో నుంచి ఒక్క పాజిటివ్ మాట కూడా రావడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కాకుండా పోతుంది. ఇకనైనా వారి వైఖరి మార్చుకోవాలి’ హితవు పలికారు.
అదే విధంగా ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ధరణి పోర్టల్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని తెలిపారు. అన్నిసవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఒకట్రెండు లోపాలు జరిగితే రాష్ట్రమంతా గందరగోళం నెలకొందని చెప్పడం సరికాదని మంత్రి హితవు పలికారు. ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం సరికాదని, శాసనసభను, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడొద్దని కేటీఆర్ సూచించారు. ధరణిని రద్దు చేయడం.. ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానామా? అని కేటీఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment