
సాక్షి, హన్మకొండ: తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా బీఆర్‌ఎస్ నేతలకు కళ్లు మండుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. అన్నింటినీ ప్రజల ముందు ఉంచుతామని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండలోని భీమదేవరపల్లిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వ్యక్తిగతం కాదు. అది ప్రభుత్వ అధికారిక పర్యటన మాత్రమే. బీఆర్‌ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ బాగుపడుతుందోనని అసూయతో ఆరోపణలు చేస్తున్నారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారు. సుంకేసుల నిర్మాణ పనులు బీఆర్‌ఎస్ హయంలోనే జరిగాయి. ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశిస్తున్నాం. మీరు విచారణకు సిద్ధమా?. మసి పూసి బట్టకాల్చి మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సుంకేసుల ఘటనపై సమగ్రమైన రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. సాంకేతిక పరమైన నివేదికలతో మీ ముందుకు వస్తాం. ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు సున్నా సీట్లు ఇచ్చిన తర్వాత వారి అసహనానికి హద్దు లేకుండా పోయింది. ప్రజా సమస్యలపై మాట్లాడాలని జ్ఞానం లేకుండా ఏదిపడితే అది మాట్లాడుతున్నారు. మీరు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. దోషులను కచ్చితంగా శిక్షిస్తాం. బరాబర్ జవాడు చెబుతాం. బీఆర్‌ఎస్, బీజేపీ వేరువేరు కాదు. ప్రజలు మిమ్మల్ని వేరువేరుగా చూడటం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment