మునుగోడు: బీజేపీ స్వార్ధంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.
ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి కొరటికల్ గ్రామంలో నిర్వహించిన కురుమ ఆత్మీయ సమ్మేళన సహపంక్తి భోజన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
గొర్రె పిల్లలిచ్చింది కేసీఆర్ ఒక్కరే
తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులవారి జీవనోపాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పువ్వాడ చెప్పారు. నిన్నటివరకు కురుమలు ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లలను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, మొదటిసారిగా వారికి గొర్రెపిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ ఒక్కరేనని మంత్రి చెప్పారు. తెలంగాణలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనను యావత్ దేశ ప్రజానీకం కోరుకుంటుంటే బీజేపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.
టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితం కావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు, కురుమ సంఘం నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment