Minister Roja Fire on Pawan Kalyan Over Volunteer Comments - Sakshi
Sakshi News home page

అబద్ధాల్లోనూ క్లారిటీ లేదు.. పిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలగొడతారు!: మంత్రి రోజా

Published Tue, Jul 11 2023 4:57 PM | Last Updated on Wed, Jul 12 2023 6:47 AM

Minister Roja Fire on Pawan Kalyan Over Volunteer Comments - Sakshi

సాక్షి, గుంటూరు: సీఎం జగన్‌ పాలన చూసి ఓర్వలేక.. ఓటమి భయంతోనే దత్తపుత్రుడితో చంద్రబాబు నాయుడు విషం చిమ్మిస్తున్నాడని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా విమర్శించారు. వాలంటీర్లను ఉద్దేశించి జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండించిన ఆమె..  మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

వాలంటీర్లు ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారని పవన్‌ అనడం దుర్మార్గం. అందుకే వాళ్లు ఈ ఉద్యోగం ఎంచుకున్నారా?. పవన్‌.. నీకు మిస్సింగ్‌కు అక్రమ రవాణాకు తేడా తెలుసా?. అసలు వాలంటీర్లు ఎవరో తెలుసా?.  మూడు రోజులుగా అడ్డూఅదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. మహిళలు, వాలంటీర్లు అంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. సిగ్గు చేటు. అసలు వార్డు మెంబర్‌గా గెలవని పవన్‌కు అసలు రిపోర్ట్‌ ఎవరిచ్చారు?.. నిఘా వర్గాలు ఇచ్చాయా? అని ఎద్దేవా చేశారామె. అసలు పవన్‌చెప్పే అబద్ధాల్లోనే క్లారిటీ లేదని అన్నారామె. 

చంద్రబాబు కూడా ఇలాగే..
స్వాతంత్య్రం వచ్చాక ఇంత గొప్పగా.. పారదర్శక పాలన అందించిన వ్యవస్థ(వాలంటీర్‌ వ్యవస్థను ఉద్దేశించి..) ఇంకోటి లేదు. కేంద్రం, ఇతర రాష్ట్రాలు మెచ్చుకున్నాయి. ఆదర్శంగా తీసుకుంటున్నాయి కూడా. అలాంటి వ్యవస్థ గురించి చులకనగా మాట్లాడడం దారుణం. చంద్రబాబు గతంలో వలంటీర్ వ్యవస్థ పై నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు దత్త పుత్రుడు విషం చిమ్ముతున్నాడు.  వలంటీర్ వ్యవస్థ నడ్డి విరచడం కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేడని పవన్‌పై మండిపడ్డారామె. దమ్ముంటే ఒకటో తేదీన వస్తే.. వాలంటీర్లు ఎలాంటి వాళ్లో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. కోవిడ్ సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కున్నారని.. ప్రభుత్వంతో కలిసి వాలంటీర్లు నిస్వార్థ్యంగా సేవలందించారని గుర్తు చేశారామె. అలాంటి వాలంటీర్లపై పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారని అని హెచ్చరించారు మంత్రి రోజా. 

తెలంగాణ గురించి మాట్లాడవేం?
ఇంతకాలం సీఎం జగన్‌ అంటేనే పవన్‌కు వణుకు అనుకున్నా. కానీ, వాలంటీర్లను చూసి కూడా వణికిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. మహిళల మిస్సింగ్‌ కేసుల్లో టాప్‌ టెన్‌లో ఏపీ లేనే లేదు. ఎవరూ సంతోషంగా ఉండకూడదనే దరిద్రపు గొట్టు ఆలోచనతో పవన్‌ ఉన్నాడు. అసలు ఆ లిస్ట్‌లో తెలంగాణ 6వ స్థానంలో ఉంది కదా.  మరి ఆ రాష్ట్రం గురించి మాట్లాడవేం అని పవన్ కల్యాణ్‌ను నిలదీశారామె. కేసీఆర్‌కు భయపడే మాట్లాడలేకపోతున్నాడని చెప్పారామె.

సిగ్గు లేకుండా ఇంటర్వ్యూ.. 

తన తల్లిని తిట్టినవాళ్లను గెలిపించమని పవన్‌ ప్రాధేయపడుతున్నారు. మీ అమ్మా.. భార్యను తిట్టింది టీడీపీ వాళ్లు కాదా?. తల్లిని చంద్రబాబు, లోకేష్ తిట్టారని 2018 లో నువ్వు ట్వీట్ చెయ్యలేదా..?. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తల్లిని తిట్టించారని ఆ సందర్భంలో చెప్పాడు. మరి ఇప్పుడు.. ఏబీఎన్‌ రాధాకృష్ణకు సిగ్గులేకుండా ఎలా ఇంటర్వ్యూ ఇచ్చావ్‌?. నీ కార్యకర్తలను  సంకరజాతి వాళ్ళు అని  బాలకృష్ణ తిడితే.. ఆయనకే ఇంటర్వ్యూ ఇస్తావా..?. మహిళల అక్రమ రవాణా జరిగింది చంద్రబాబు హయాంలోనే. ఆ టైంలో జరిగిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌పై అసలు ఎందుకు పెదవి విప్పలేదని పవన్‌ను సూటిగా ప్రశ్నించారామె.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే జగనన్న ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ని సిగ్గు ఎగ్గూ లేకుండా పవన్ చదువుతున్నాడని అన్నారు. ఏ మాత్రం బుద్ధి ఉన్నా వాలంటీర్ల కాళ్లు పట్టుకుని పవన్‌ క్షమాపణ కోరాలన్నారు మంత్రి రోజా. 

‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 46 ఏళ్ళకే సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు  అయిన ఎమ్మెల్యే కాదు కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదు. సీఎం జగన్‌ను సింగ్లర్‌గా పిలవడం కాదు.. దమ్ముంటే జగన్ మీద సింగిల్‌గా పోటీ చెయ్యు’’ అని పవన్‌కు సవాల్‌ విసిరారామె.

ఇదీ చదవండి: వాలంటీర్లపై కామెంట్ల ఎఫెక్ట్‌.. పవన్‌పై సెటైర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement