
సాక్షి, కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): ‘పవన్ కళ్యాణ్ ప్రపంచంలోనే పెద్ద అరాచకవాది. ఇలాంటి అరాచకవాది మరొకరుండరు. ఆయన దుర్మార్గ పనులను సమర్థించుకునేందుకు మిగతా మగవారిని కూడా అలాగే నడవమంటున్నాడు. స్త్రీలను స్టెపినీలు అంటూ అసభ్యంగా సంబోధించిన వ్యక్తి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండటానికి అనర్హుడు. మరోసారి స్త్రీల పట్ల నీచంగా మాట్లాడితే రాక్షసులను సంహరించిన దుర్గాదేవిలా మహిళలే బుద్ధి చెబుతారు’ అని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ సభ్య సమాజం తలదించుకునే పదజాలంతో ప్రజా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇలాంటి విలువలు లేని నాయకుడిని సమర్థిస్తూ టీడీపీ నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టడం, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు, లోకేశ్ వంతపాడటం దుర్మార్గ రాజకీయానికి అద్దం పడుతోందన్నారు. పవన్, లోకేశ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఓ మహిళగా డిమాండ్ చేస్తున్నానన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రి ఇంకా ఏమన్నారంటే..
మహిళల మానంతో ఆడుకోవాలా?
‘మీరూ మూడు పెళ్లిళ్లూ చేసుకోండి’ అంటూ పవన్ మాట్లాడుతున్నారు. యువతకు మీరిచ్చే సందేశం ఇదేనా? మహిళల మానంతో ఆడుకోవాలని చెబుతున్నారా? మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? వారు చేసిందే గొప్ప అని పవన్, చంద్రబాబు ఒక లైన్ తీసుకున్నారు. పవన్‌తో టీడీపీ వారే బూతులు తిట్టించారు. అందుకే దత్త పుత్రుడికి చంద్రబాబు కొడుకు లోకేశ్ మద్దతు పలుకుతూ అవే పదాలు ఉపయోగించారు. ‘నా కొడుకులు’ అని పవన్, లోకేశ్, అయ్యన్న పాత్రుడు.. ఇలా వారంతా మాట్లాడుతున్నారు. వారందరికీ వారి బిడ్డల మీద కోపం ఉన్నట్టుంది. పవన్ వ్యాఖ్యలను గొప్పగా చిత్రీకరిస్తూ ఎల్లో మీడియాలో డిబేట్లు నడిపారు. టీడీపీ పత్రికల్లో జనసేన అధినేత అసభ్య పదజాలాన్ని పైకెత్తుతూ కథనాలు రాశారు. ఇదేమి పద్ధతి?
ఏమిటా వెకిలినవ్వు బాబూ?
చంద్రబాబు, ఆయన కొడుకు సమాజానికి ఏం చెప్పదలచుకున్నారు? ఆడపిల్ల నచ్చితే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపు చేయాలన్న బాలకృష్ణకు ఉన్న విలువలు ఏమిటి? మొత్తంగా టీడీపీ టాప్ లీడర్లు అందరూ మహిళలను గౌరవించడంలో దిగజారి ప్రవర్తిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆడపిల్లలతో మందు, విందు చేసుకోవటంలో తప్పేమిటి అని నారా లోకేశ్ ‘ఆహా’ షోలో అంటాడు. ఆ ఫొటోలను నిస్సిగ్గుగా సమర్థిస్తూ మామకు (బాలకృష్ణకు) లేని అభ్యంతరం తనకు ఎందుకని చంద్రబాబు వెకిలినవ్వు నవ్వుతాడు. అమ్మాయిల వ్యవహారాలు ‘మీరు సినిమాల్లో చేసిన దానికంటే.. నేను నిజ జీవితంలో ఎక్కువ చేశాను’ అని వయసు కూడా మర్చిపోయి చంద్రబాబు చెప్పడం చూసి ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు.
ఎక్కడైనా పోలిక ఉందా?
కోడలు కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా? ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తా అన్న చంద్రబాబు అహం ఎక్కడ? అదే మహిళలకు అన్నింటా 50 శాతం ప్రాతినిథ్యం కల్పించిన సీఎం జగన్ మనసు ఎక్కడ? సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్నింటా అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అభినవ అంబేడ్కర్‌గా, పూలె అడుగుజాడల్లో నడుస్తున్న సీఎం జగన్ వెంటే మహిళలంతా ఉన్నారు. జగన్‌కు ఉన్న ఇంతటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా సరే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మళ్లీ వైఎస్సార్‌సీపీకే పట్టం కడతారు. ప్రభుత్వం చేసే మంచి పనుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడమే పవన్, చంద్రబాబు, దుష్టచతుష్టయం పని. మొన్న విశాఖ గర్జన సందర్భంగా పవన్ ఆడిన డ్రామానే ఇందుకు నిదర్శనం. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును అడ్డుకుంటున్నారు. అసలు వాళ్లు రాయలసీమకు అనుకూలమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment