
టీడీపీ గెలిస్తే అన్నీ అనర్థాలే
సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆపేస్తారు
వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి
సాక్షి, అమలాపురం: వైఎస్ జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని.. టీడీపీ గెలిస్తే అన్నీ ఆగిపోతాయని వైఎస్సార్‌సీపీ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. వలంటీర్, సచివాలయాల వ్యవస్థలు లేకుండా పోతాయని.. సచివాలయాలన్నీ జన్మభూమి కమిటీల కార్యాలయాలుగా మారిపోతాయనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం చాకలిపాలెంలో జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో మిథున్‌రెడ్డి మాట్లాడారు.
‘ఇంటింటికీ వెళ్లినప్పుడు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతో పాటు ఆయన మళ్లీ సీఎం కాకపోతే జరిగే నష్టాలను కూడా ప్రజలకు వివరించండి. చంద్రబాబు అధికారంలోకి వస్తే జరిగే అనర్థాలను తెలియజేయండి. జన్మభూమి కమిటీల పెత్తనం మళ్లీ పెరుగుతుందని వివరించండి. వైఎస్ జగన్ పాలన మళ్లీ వస్తేనే ఇంటింటికీ సంక్షేమాభివృద్ధి అందుతుందని తెలియజేయండి’ అని సూచించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన గందరగోళంలో ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఎవరనేది తేల్చుకోలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి చూస్తుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలను క్లీన్‌స్వీప్ చేస్తామనే నమ్మకం తనకు పెరిగిందన్నారు.
సీఎం జగన్ కోసం నెల రోజులు కష్టపడితే.. ఆయన మళ్లీ సీఎం అయిన తర్వాత అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటారని చెప్పారు. మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. ఎంతమంది కలిసి వచ్చినా, ఎన్ని పాచ్చిలు పొత్తు పెట్టుకున్నా.. ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్‌ను ఓడించడం సాధ్యం కాదన్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రధానులు, ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు ఎవ్వరూ లేరన్నారు. సీఎం జగన్ ఒక్కరే మేనిఫెస్టోలోని ప్రతి హామీనీ నెరవేర్చారని చెప్పారు. సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయెల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పాల్గొన్నారు.