MK Stalin: 7న స్టాలిన్‌ ప్రమాణం | MK Stalin set to take oath as CM on May 7 | Sakshi
Sakshi News home page

MK Stalin: 7న స్టాలిన్‌ ప్రమాణం

Published Tue, May 4 2021 6:14 AM | Last Updated on Tue, May 4 2021 12:53 PM

MK Stalin set to take oath as CM on May 7 - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) శాసన సభాపక్ష సమావేశం మంగళవారం జరుగనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు సమావేశమై, తమ శాసనసభాపక్ష నేతగా ఎం.కె.స్టాలిన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శాసనసభా పక్ష భేటీ అనంతరం స్టాలిన్‌ పార్టీ ముఖ్య నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు ఆ తీర్మానం ప్రతిని అందజేసి, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. గవర్నర్‌ సూచన మేరకు ఈ నెల 7న రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా స్టాలిన్‌ నిరాడంబరంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

స్టాలిన్‌తోపాటు మరో 29 మంది మంత్రులుగా పదవీ ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. స్టాలిన్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత చెన్నై మెరీనా బీచ్‌లోని కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తానని చెప్పారు. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డీఎంకే దళపతి స్టాలిన్‌కు తమిళనాడు సీఎం, ఏఐఏడీఎంకే సీనియర్‌ నేత పళనిస్వామి అభినందనలు తెలియజేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 7న జరుగనుంది.

పళనిస్వామి రాజీనామా
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ ఆమోదించినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు సోమవారం తెలిపాయి. మధ్యాహ్నం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పేర్కొన్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరేదాకా పదవిలో కొనసాగాలని సీఎం పళనిస్వామిని గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ కోరారు. తమిళనాడు 15వ శాసనసభను గవర్నర్‌ రద్దు చేశారు.
 
పుదుచ్చేరిలో 7న ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు
పుదుచ్చేరీ ముఖ్యమంత్రిగా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌ రంగస్వామి ఈ నెల 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్‌డీఏ కూటమి విజేతలు ఎన్‌ఆర్‌ రంగస్వామిని శాసనసభాపక్ష నేతగా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement