సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటే ప్రజల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతాను. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా?. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా. అక్రమ కట్టడాలకు బీఆర్‌ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఏడ్చింది.. నాకు చాలా బాధగా అనిపించింది. పేదల విషయంలో హైడ్రా మరోసారి ఆలోచించాలి.
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు పది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మా కేసు బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నారు. కాస్త ఆలస్యం అయినా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పక్కా. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తిట్టిస్తున్నారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను’అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా..‘మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్‌షా కోట్‌లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.
ఇది కూడా చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: హైడ్రా రంగనాథ్
Comments
Please login to add a commentAdd a comment